https://oktelugu.com/

సెక్యులరిజం పరిరక్షణకు ప్రపంచమంతా ఒకటి కావాలి

ఇది ఆధునిక ప్రపంచ విలువలకు అగ్నిపరీక్ష. ఓ మత ప్రవక్తపై ఏదో పత్రిక కార్టూను వేసినందుకు అమాయక ప్రజల్ని చంపేయటం చూస్తే మనం మధ్య యుగాల్లో వున్నామా అనిపిస్తుంది. ఆ కార్టూను వేసిన పత్రిక అనేక పర్యాయాలు కాథలిక్ చర్చ్ అధిపతి పోప్ పై కూడా వేసింది. జీసస్ క్రీస్ట్ పై కూడా వేసింది. ఆ పత్రిక ఇటువంటి సెటైర్లు వేయటం,అదీ అన్ని మతాలపై ఇలా కార్టూన్లు వేయటం జరుగుతూనే వుంది. కారణం ఫ్రాన్స్ రాజ్యాంగం దీన్ని […]

Written By:
  • Ram
  • , Updated On : November 1, 2020 / 08:03 AM IST
    Follow us on

    ఇది ఆధునిక ప్రపంచ విలువలకు అగ్నిపరీక్ష. ఓ మత ప్రవక్తపై ఏదో పత్రిక కార్టూను వేసినందుకు అమాయక ప్రజల్ని చంపేయటం చూస్తే మనం మధ్య యుగాల్లో వున్నామా అనిపిస్తుంది. ఆ కార్టూను వేసిన పత్రిక అనేక పర్యాయాలు కాథలిక్ చర్చ్ అధిపతి పోప్ పై కూడా వేసింది. జీసస్ క్రీస్ట్ పై కూడా వేసింది. ఆ పత్రిక ఇటువంటి సెటైర్లు వేయటం,అదీ అన్ని మతాలపై ఇలా కార్టూన్లు వేయటం జరుగుతూనే వుంది. కారణం ఫ్రాన్స్ రాజ్యాంగం దీన్ని వ్యతిరేకించదు. వ్యక్తికి పూర్తి స్వాతంత్రం వుంది. ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఆ దేశపు విధానం. దాన్ని ఆదేశంలో వున్న పౌరులు ఆమోదించారు, అక్కడ నివసిస్తున్న ముస్లింలతో సహా. అందుకే ‘ఫ్రెంచ్ కౌన్సిల్ ఆఫ్ ముస్లిం ఫైత్’ ఈ వరస హత్యల్ని ఖండించింది. ఫ్రెంచ్ మొత్తం పశ్చిమ యూరప్ లోనే అత్యధిక ముస్లిం జనాభా కల దేశం. అంతే కాదు హేతువాదులు అధికంగా కల దేశం. దాదాపు 37 శాతం ప్రజలు ఏ మతాన్ని నమ్మరు. అది వాళ్ళ హక్కు. మతాన్ని నమ్మే వాళ్లకు ఎంత స్వేచ్చ వుందో నమ్మని వాళ్లకు అంతే స్వేచ్చ వున్న దేశం. ప్రతిదేశం అక్కడున్న ప్రజల్ని బట్టి, వారి వారసత్వ సాంస్కృతిక సంప్రదాయాన్ని బట్టి రాజ్యాంగాల్ని ఏర్పరుచుకుంటాయి. బయటనుంచి అక్కడకు వెళ్ళినవాళ్ళు ఆ దేశపు చట్టాల్ని గౌరవించాలి. అంతేగాని ఎక్కడనుంచి వెళ్ళారో ఆ దేశపు సంప్రదాయాల్ని అమలు చేస్తామంటే కుదరదు. ఇటీవల జరిగిన రెండు సంఘటనల్లో హత్యకు పాల్పడినవారు ఇతరదేశాలనుంచి శరణార్ధులుగా వచ్చినవారు. వాళ్లకు మహమ్మద్ ప్రవక్త పై కించిత్తు విమర్శని కూడా సహించని దేశం నుంచి, ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చు. కాని ఫ్రెంచ్ సంప్రదాయం వేరు. మతదూషణ ఫ్రెంచ్ లో నేరంకాదు. అందుకే ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ అలా మాట్లాడవలసి వచ్చింది.

    ఇస్లాం దేశాధినేతల ప్రకటనలు మత వుద్రిక్తలను రెచ్చగొట్టాయి

    టర్కీ అధ్యక్షుడు ఎర్డ్ గోవన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, మలేషియా పూర్వ ప్రధానమంత్రి మహతీర్ మహమ్మద్, ఇరాన్ అధ్యక్షుడు రౌహాన్ లాంటి వారు నోరు పారేసుకోవటం చూసాం. ఒక్కొక్కరికి ఒక్కో కారణం వుంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డ్ గోవన్ కి మొత్తం ఇస్లాం ప్రపంచాన్ని తిరిగి ఒట్టమాన్ సామ్రాజ్యం లాగ ఏలాలని వుంది. కాని తన నడవడిక అంతర్గతంగా ఏమీ బాగాలేదు. అసంతృప్తిని నిర్ధాక్షిణ్యంగా అణచటం, సోదర ముస్లింలైన కుర్డుల్ని నిర్ధాక్షిణ్యంగా చంపటం, పూర్వ మ్యూజియంలను మసీదులుగా మార్చటం నిత్యకృత్యం గా మారింది. దీనికి తోడు టర్కీ ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా తయారవుతుంది. దీనినుంచి దృష్టి మరల్చటానికి దీన్నో అవకాశంగా మార్చుకున్నాడని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక మన పొరుగు దేశం పాకిస్తాన్ నేత గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం,ముస్లింలలోనే సున్నీయేతర తెగల ప్రజలపై దాడులు చేయటం, పంజాబీ యేతర ప్రాంత ముస్లిం ప్రజల్ని నానారకాలుగా వేధించటం, రెండో తరగతి పౌరులుగా చూడటం సర్వసాధారణ మయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా  ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇమ్రాన్ ఖాన్ కి వ్యతిరేకంగా గళం విప్పితే ఆ అంశాన్ని పక్కదారి మల్లించటానికి మంచి వంక దొరికింది. ఇక మహతీర్ కి 90 ఏళ్ళు పైబడినా పదవిపై మోజు తీరలేదు. ఇటీవలే పదవినుంచి బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. జాకీర్ నాయక్ లాంటి వాళ్లకు ఆశ్రయమిచ్చి ఉగ్రవాదానికి పరోక్షసాయం చేస్తున్నాడు. ఇరాన్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రజాస్వామ్యవాదుల్ని దేశంనుంచి తరిమేసి మతపాలనను సుస్థిరం చేసుకొని ఇతర ముస్లిం దేశాల్లో తిరుగుబాటుల్ని ప్రోత్సహిస్తూ ఇస్లాం పరిరక్షణలో తనకు సాటిలేరని పోటీ పడుతుంది.

    చిత్తశుద్ది లేని విమర్శలు 

    వీళ్ళందరికీ ఒకదానిలో పోలిక వుంది. అదేమిటంటే 10లక్షల మంది వీఘర్ ముస్లింలను నిర్బంధ శిబిరాల్లో ఉంచిన చైనాని ఒక్కమాట అనకపోవటం. వీళ్ళకు నిజంగా ఇస్లాం మీద అభిమానం వుంటే చైనా దుశ్చర్యలను ఎప్పుడో ఖండించేవాళ్ళు. ఇందులో ఏఒక్కరు చైనా జిన్జియాంగ్ ప్రావిన్సులో ముస్లింలపై, ఇస్లాంపై జరుపుతున్న దారుణాలను గుర్తుచేసుకున్న పాపాన పోలేదు. ఫ్రాన్స్ లో కార్టూన్ వేసినందుకు ఇంతగా గొడవలు చేసే వీరు , చైనాలో సిసి టివిలో మహమ్మద్ ప్రవక్త ఫోటోను వేసి ప్రదర్శన చేస్తే కిమ్మనరు. కారణం చైనాను విమర్శించే దమ్ములేదు. చైనా లాగా ఫ్రాన్స్ ప్రభుత్వమేమీ ముస్లింలను రెండో తరగతి పౌరులుగా చూడలేదు. వాళ్ళు చెప్పేదల్లా పౌరులందరూ అక్కడి సంప్రదాయాల్ని గౌరవించమని. అదేసమయంలో ఎవరి మత విశ్వాసాలు వారు పాటించవచ్చని కూడా చెప్పింది. వాస్తవానికి ముస్లిం దేశాల్లో నుంచి వచ్చిన వారికి ఎక్కువమందికి ఆశ్రయమిచ్చిన దేశం ఫ్రాన్స్ నేనని మరవొద్దు.

    అసలు ఈ దేశాల్లో సెక్యులరిజం మచ్చుకు కూడా కనబడదు. మైనారిటీలకు కనీస హక్కులు కూడా ఇవ్వరు. వీళ్ళు ఇంకో దేశానికి నీతులు చెప్పే పరిస్థితుల్లో లేరు. ఉదాహరణకు పాకిస్తాన్ లో మైనారిటీలను ఎంత దారుణంగా చూస్తారో మనందరికి తెలుసు. స్వతంత్రం వచ్చినప్పుడు ఇతర మతస్తులు ఎంతమంది వున్నారు, ఇప్పుడు ఎంతమంది వున్నారో చూస్తే ఇమ్రాన్ ఖాన్ చెప్పే గురువిందగింజ సామెత తెలుస్తుంది. మిలిటరీ నీడలో పరిపాలన చేసే ఇమ్రాన్ ఖాన్ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఇరాన్ సంగతి సరే సరి. టర్కీ ఒకనాడు నిజమైన సెక్యులర్ దేశం. కమాల్ అటాటుర్క్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అధికారాన్ని చేపట్టి టర్కీ ని అభ్యుదయ పధాన నడిపించాడు. ఎర్డ్ గోవన్ అధికారం చేపట్టాక మెల్లి మెల్లిగా మత భావాల్ని చొప్పించాడు. ఆధునిక టర్కీ స్థాపిత ఆదేశాలకి విరుద్ధంగా దేశాన్ని తిరోగమన పంధాలో నడిపిస్తున్నాడు. మధ్య ఆసియాలోని అరబ్బు దేశాలు పూర్తి రాచరిక వ్యవస్థలో వున్నాయి. ఈ దేశాల్లో ప్రజాస్వామ్యం,సెక్యులరిజం మచ్చుకు కూడా కనబడవు. కానీ ఫ్రాన్స్ లో, భారత్ లో మాత్రం ఇస్లాం మతవాదులు సెక్యులరిజం జపం చేస్తూ వుంటారు. కానీ వీళ్ళకి సెక్యులరిజం మీద ప్రేమలేదు. వుంటే ఇస్లామిక్ మెజారిటీ దేశాల్లో సెక్యులరిజంని పాటించమని ఎప్పుడూ డిమాండ్ చేసిన పాపాన పోలేదు. సెక్యులరిజం ఈ మతవాదులకు ఓ రక్షణ కవచం మాత్రమే. అయితే వీళ్ళ నిజస్వరూపం తెలపటానికే ఈమాట అంటున్నాము. మనదేశం ఇటువంటి అవకాశవాదులతో సంబంధంలేకుండా నిజమైన సెక్యులరిజాన్ని పాటించాలి. మత విశ్వాసాల పేరుతో రాజ్యాంగ చట్టాల్ని ఎవరూ అతిక్రమించరాదు. ఎప్పటికైనా వుమ్మడి పౌర సంస్కృతిని తీసుకువస్తేనే సెక్యులర్ విలువలు పరిరక్షించబడతాయి, బలపడతాయి.

    భారత్ లో పరిణామాలు

    నిన్ననే దేశంలోని 100కి పైగా వివిధరంగాల ప్రముఖులు ఫ్రాన్స్ లోని హత్యలని నిర్ద్వందంగా ఖండించటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది సెక్యులర్ భావాల బలోపేతానికి దోహదపడుతుంది. దీన్నే మేము కోరుకొనేది. ఇందులో నసీరుద్దిన్ షా, జావేద్ అక్తర్,షబానా అజ్మి,స్వర భాస్కర్, ప్రశాంత్ భూషణ్, మేధా పాట్కర్, మృదుల ముఖర్జీ లాంటివారు వున్నారు. భారత్ లో దీనిపై అందరికన్నా ముందుగా ప్రధానమంత్రి మోడీ ఈ హత్యల్ని ఖండించాడు. ఒకవైపు ఇస్లాం మతవాదులు ఫ్రెంచ్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు తీస్తుంటే, ఫ్రెంచ్ అధ్యక్షుడి ఫోటో వున్న పేపర్లను కాలి కింద తొక్కుతూ నిరసనలు తెలుపుతుంటే, రెండోవైపు అటు మోడీ, ఇటు రాజకీయంగా మోడీని వ్యతిరేకించే ఈ వివిధరంగాల ప్రముఖులు ఏకం కావటం సంతోషించదగ్గ పరిణామం. ఇదే కావాల్సింది. ఆధునిక ప్రజాస్వామ్యం బలపడాలంటే ఇటువంటి సందర్భాల్లో అందరూ ఒకటవ్వాల్సి వుంది. మరి కాంగ్రెస్ లాంటి స్వయం ప్రకటిత సెక్యులర్ పార్టీలు ఇంతవరకు నోరు మెదపకపోవటం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ భోపాల్ లో మతవాదులతో కలిసి నిరసన ప్రదర్శనలో పాల్గొనటం,దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించక పోవటం గమనించాలి. ఈ కాంగ్రెస్ అవకాశావాదమే సెక్యులరిజానికి తలవంపులు తెచ్చింది. వివిధరంగాల ప్రముఖులు ఇచ్చిన ప్రకటన చూసిన తర్వాతయినా కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. లేకపోతే కాంగ్రెస్ పూర్తిగా ఇస్లాం మతవాదుల పక్షాన వుందని అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. ఓటుబ్యాంకు రాజకీయాలకి ప్రాధాన్యత నిస్తుందో సెక్యులర్ భావాలకి ప్రాధాన్యతని ఇస్తుందో కాంగ్రెస్ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.

    ఒవైసీ లాంటి వారు ప్రతివేదిక ను ఉపయోగించుకొని సెక్యులర్ పదజాలాన్ని పదే పదే వల్లే వేస్తుంటాడు. మరి ఇప్పుడు ఈ హత్యల్ని ఖండించకపోతే తన సెక్యులరిజం నేతిబీరకాయలో నేయిలాంటిదని అనుకోవాల్సివుంటుంది. బీహార్ ఎన్నికల్లో వాళ్ళ సంఘటనకి గ్రాండ్ సెక్యులర్ ప్రజాస్వామ్య ఫ్రంట్ గా నామకరణం చేసుకున్నారు కదా. ఆ పేరుని తొలగించుకుంటారా లేక ఈ హత్యల్ని ఖండిస్తారా నిర్ణయించుకోవాలి. మిగతా పార్టీలకు కూడా ఇది అగ్ని పరీక్షే. కమ్యూనిస్టులు,సోషలిస్టులు,మిగతా ప్రతిపక్షాలు నిజమైన సెక్యులర్ భావాలకు కట్టుబడి వుంటే అందరూ ఒకటై మతం పేరుచెప్పి జరిపే హత్యల్ని ఖండించాలి. లేకపోతే బిజెపి చెప్పే సుడో సెక్యులర్ వాదులనే ముద్రకు అవకాశమిచ్చినవారు అవుతారు. సెక్యులరిజాన్ని ఓటుబ్యాంకు రాజకీయాలకు బలిచేస్తున్నారనే అపప్రధ నుంచి బయటపడటానికి ఇదో బంగారు అవకాశం. మేము మతవాదం ఎటువైపునుంచి వచ్చినా వ్యతిరేకిస్తామని చెప్పుకొనే అవకాశం వచ్చింది. సెక్యులరిజం ఎన్నికల అంశంగా మారకుండా ఉండాలంటే అన్ని పార్టీలు ఈ విషయంలో ఏకమై ఫ్రాన్స్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న మతవాదాన్ని ఖండించాలి, మతదూషణ వంకతో అమాయక ప్రజల్ని హత్యచేయటాన్ని ముక్త కంఠంతో ఖండించాలి. అప్పుడే భారత్ లో సెక్యులరిజం బలపడుతుంది. సెక్యులర్ వాదులారా మేల్కొనండి,వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.