ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవుతున్నా.. ఎస్ఈసీ.. అధికార పార్టీకి మధ్య వైరం చల్లారడం లేదు. ఏపీలో మెదటి, రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. వైసీపీ మద్దతుదారులు ఎక్కువమంది విజయం సాధించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరు మొత్తం దాదాపు ఏకగ్రీవం అయ్యింది. బలవంతపు ఉపసంహరణలు.. బెదిరింపులు మాత్రమే కాదు.. కొన్నిచోట్ల పేపర్లు అన్నీ సక్రమంగా ఉన్నా.. నామినేషన్లకు కొంతమంది అధికారులు తిరస్కరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఎన్నికల తీరుపై హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. వాటిని పరిశీలించాలని హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది.
Also Read: ఏపీలో భారీ పోలింగ్.. పోటెత్తిన జనం.. ప్రారంభమైన కౌంటింగ్
మామూలుగా అయితే అధికారులు ఇచ్చే నివేదికపై నిమ్మగడ్డ ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన దూకుడుగా వ్యవహరించాలని అనుకుంటున్నారు. స్వయంగా పుంగనూరులో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఆయన పుంగనూరు పర్యటన పెట్టుకున్నారు. శ్రీవారి దర్శనానికి కుటుంబసమేతంగా వెళ్లిన ఆయన అక్కడే… ఉండి సోమవారం పుంగనూరులో పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. ఆయన అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి.. ఏకగ్రీవాలపై నిర్ణయం తీసుకుంటారు. అదే జరిగితే.. అక్కడ ఏకగ్రీవాలన్నీ రద్దుచేసి… కేంద్రబలగాలతో ఎన్నికలు నిర్వహించినా.. ఆశ్చర్యం అవసరం లేదు.
Also Read: జగన్ తొందరగా మేల్కోవాల్సిందే..: లేదంటే మొదటికే మోసం
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ఎస్ఈసీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కోర్టు ఆంక్షలు పెట్టడంతో ఆ బాధ్యతను వేరేవారు తీసుకున్నారు. దీంతో నిమ్మగడ్డ ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో తనకు ఎదురు ఉండకూడదన్న లక్ష్యంతో ఉన్న పెద్దరెడ్డి.. ఏకగ్రీవాల కోసం ఎవరినీ లెక్క చేయడం లేదు. ఈ కారణంగా పరిస్థితులు దిగజారుతున్నాయి. పుంగనూరులో ఎస్ఈసీ పర్యటనపై పోలీసులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఎస్ఈసీ నిమ్మగడ్డ పుంగనూరు వెళితే.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని అన్నట్లు సమాచారం. అయినాసరే తాను పుంగనూరులో పర్యటించి హైకోర్టుకు నివేదిక అందిస్తానని నిమ్మగడ్డ అంటున్నారు. ఎస్ఈసీ పర్యటనలో ఉద్రిక్తత తలెత్తితే.. పుంగనూరులో పరిస్థితులపై మరింత దారుణమైన నివేదికలు రావడం మాత్రం ఖాయం. అందుకే పెద్దిరెడ్డి వర్గానికి ఇప్పుడు టెన్షన్ ప్రారంభం అయ్యింది. ఏకగ్రీవాలు ఉంటాయా..? ఊడతాయా..? అనే అనుమానంలో వైసీపీ నేతలు ఉన్నారు.