https://oktelugu.com/

TDP: కృష్ణా జిల్లాలో ఆ మూడు స్థానాలు టీడీపీకి హాట్ గురూ

ప్రధానంగా పెనమలూరు, మైలవరం, తిరువూరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లో వైసిపి సిట్టింగ్లే ఉన్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : February 21, 2024 1:18 pm
    TDP

    TDP

    Follow us on

    TDP: తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న జిల్లాల్లో కృష్ణా ఒకటి. ఎన్టీఆర్ సొంత జిల్లాతో పాటు కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లా ఇది. పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపి మంచి ఫలితాలు సాధిస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో మాత్రం దెబ్బతింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్థితులు తప్పవని విశ్లేషణలు ఉన్నాయి. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి వైసీపీ సర్కార్ మూడు రాజధానులను తెరపైకి తేవడంతో.. ఈ జిల్లాలో అధికార పార్టీపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. దీంతో ఈ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలు కూడా అదే అంశాన్ని తేల్చి చెబుతున్నాయి. దీంతో టీడీపీ టికెట్ల కోసం గట్టి పోటీ ఉంది.

    ఈ జిల్లాలో గెలుపోటములను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ప్రతి సీటు గెలిచేందుకు టిడిపిలో స్థానిక నేతలతో పాటు ఎన్నారైలు సైతం పనిచేస్తుంటారు. అభ్యర్థులకు పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తుంటారు. దీంతో ఫలితం ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలకు విపరీతమైన పోటీ నెలకొంది. ఈ సీట్లలో టిడిపి గెలుపు పై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో టిక్కెట్ల కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. ఎవరికివారుగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. వారికోసం పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి.

    ప్రధానంగా పెనమలూరు, మైలవరం, తిరువూరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లో వైసిపి సిట్టింగ్లే ఉన్నారు. ఇందులో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టిడిపిలో చేరనున్నారు.ఈ మూడు స్థానాల్లో వైసిపి గెలిచే ఛాన్స్ లేదని అంతర్గత సర్వేలు చెబుతున్నాయి. దీంతో టీడీపీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కో నియోజకవర్గంలో నుంచి ముగ్గురేసి అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ పెద్దలతో పెద్ద లాబీయింగ్ చేస్తున్నారు. పెనమలూరు కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా, మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అటు మైలవరం టికెట్ కోసం వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు దేవినేని ఉమా ప్రయత్నిస్తున్నారు. బొమ్మసాని సుబ్బారావు సైతం తన ప్రయత్నాల్లో ఉన్నారు. తిరువూరు సీటు కోసం ప్రస్తుతం ఇంచార్జ్ సేవల దేవదత్, అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు, తోకల జనార్ధన రావు, వైసీపీ నుంచి వచ్చిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి, గతంలో పోటీచేసి ఓడిన జవహర్ పేర్లు వినిపిస్తున్నాయి. టిడిపి కచ్చితంగా గెలిచే స్థానాలు కావడంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వారిలో టిక్కెట్ దక్కించుకునేది ఎవరో చూడాలి.