TSPSC Paper Leak : టీఎస్.పీఎస్సీ పేపర్ లీక్ లో మరో కీలక పరిణామం

TSPSC Paper Leak : టీఎస్‌ పీఎస్‌సీలో పేపర్‌ లీకేజీలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. మొదట్లో ఏఈ పేపర్‌ మాత్రమే లీక్‌ అయిందని అధికారులు చెప్పారు. తర్వాత గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌, రేణుక చెప్పిన వివరాల ఆధారంగా కూపీ లాగుతున్న అధికారులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇందులో తాజాగా వెలుగులోకి వచ్చిన పేర్లు సుస్మిత, లౌకిక్‌. డీఏవో పేపర్‌ లీకేజీలో వీరి పేర్లు ప్రముఖంగా విన్పించిన […]

Written By: Bhaskar, Updated On : April 15, 2023 8:34 pm
Follow us on

లౌకిక్‌, సుస్మిత ఇంట్లో సోదాలకు వెళ్తున్న అధికారులు

TSPSC Paper Leak : టీఎస్‌ పీఎస్‌సీలో పేపర్‌ లీకేజీలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. మొదట్లో ఏఈ పేపర్‌ మాత్రమే లీక్‌ అయిందని అధికారులు చెప్పారు. తర్వాత గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌, రేణుక చెప్పిన వివరాల ఆధారంగా కూపీ లాగుతున్న అధికారులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇందులో తాజాగా వెలుగులోకి వచ్చిన పేర్లు సుస్మిత, లౌకిక్‌. డీఏవో పేపర్‌ లీకేజీలో వీరి పేర్లు ప్రముఖంగా విన్పించిన నేపథ్యంలో సిట్‌ అధికారులు విచారించారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా విచారణ చేశారు. అనంతరం వారు శనివారం ఖమ్మం వచ్చారు.

సిట్‌ అధికారుల అదుపులో లౌకిక్‌

ఖమ్మం నగరంలో సోదాలు

ఖమ్మం నగరంలో సిట్‌ అధికారులు శనివారం సుస్మిత, లౌకిక్‌తో కలిసి ఖమ్మం వచ్చారు. వారి ఇంట్లో సోదాలు చేశారు. అయితే టీఎస్‌ పీఎస్‌సీ నిర్వహించిన పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీ అవగా.. అందులో డీఏవో ప్రశ్నాపత్రం కూడా ఉన్నట్టుగా గుర్తించిన సిట్‌ అధికారులు అందులో ఎవరెవరు ఉన్నారు వంటి అంశాలపై విచారణ చేపట్టారు. అందులో భాగంగా వారం రోజుల క్రితం ఖమ్మం నగరానికి చెందిన లౌకిక్‌, సుష్మిత దంపతులను వారు అరెస్టు చేశారు. కాగా వారిని విచారించే క్రమంలో భాగంగా శనివారం లౌకిక్‌, సుష్మితలతో కలిసి ఖమ్మం వచ్చిన నలుగురు అధికారులు, మరో మహిళా అధికారి లౌకిక్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.

ప్రవీణ్‌కు విక్రయించాడు

గతంలోనే డీఏవో పేపర్‌ లీక్‌ అయినట్టు ధృవీకరించుకున్న అధికారులు.. ఖమ్మం నగరానికి చెందిన లౌకిక్‌, సుష్మిత దంపతులకు ప్రవీణ్‌ విక్రయించినట్టు గుర్తించారు. విచారణలో భాగంగా అసలు పేపరు లీకేజీ ఎలా జరిగింది? ఎంత మందికి విక్రయించారు? అది వారితోనే ఆగిందా? లేక కొనుగోలు చేసిన వారు మరెవరికైనా పంపారా? వంటి పలు కోణాల్లో సిట్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం ఖమ్మం నగరంలోని లౌకిక్‌, సుష్మిత దంపతులను తీసుకుని ఖమ్మం వచ్చిన అధికారులు ఇంట్లో ల్యాప్‌ట్యాప్‌ వంటి పరికరాలతో పాటు, నగదు లావాదేవీలకు సంబంధించి సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రవీణ్‌ నుంచి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన లౌకిక్‌ ఆ ప్రశ్నాపత్రాన్ని మరెవరికైనా షేర్‌ చేశారా అన్న కోణంలో అధికారులు విచారణ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సిట్‌ అధికారులు వారి ఇంటి నుంచి పలు విలువైన పేపర్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

లౌకిక్‌, సుస్మిత నివాసం

రూ. 10 లక్షలకు ఒప్పందం

భార్య సుష్మిత కోసం భర్త లౌకిక్‌ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్టు గతంలోనే గుర్తించిన అధికారులు రూ. 10 లక్షలు ఒప్పందం చేసుకుని.. ముందుగా రూ. 6 లక్షలు ప్రవీణ్‌కు చెల్లించినట్టు నిర్ధారించారు. కాగా సుష్మిత గతేడాది అక్టోబరులో టీఎస్‌ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలో మెయిన్స్‌కు క్వాలీఫై కాలేకపోయింది. ఆ తర్వాత డీఏవో పరీక్ష పరీక్షకు సంబంధించిన దరఖాస్తులో సాంకేతిక సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సుష్మిత తన భర్తతో కలిసి టీఎస్‌ పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో వారికి సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడగా.. పేపరు కొనుగోలుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం.