Manish Tiwari on Agnipath: కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారి పోతోంది.. అధికార పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో ప్రతిసారి విఫలమౌతోంది. ముసలాన్ని పసిగట్టలేక ఇప్పటికే మహారాష్ట్రను కోల్పోయింది. ఇప్పుడు చేతిలో రాజస్థాన్ ఛతీస్ఘడ్ రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అక్కడ కూడా బిజెపి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పార్టీకి చేదోడువాదోడుగా ఉండాల్సిన నాయకులు చేయిస్తున్నారు. మొన్న పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి అమరీందర్ సింగ్, నిన్న ఆనంద్ శర్మ, నేడు మనీష్ తివారీ, మరి రేపు?

కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చారు
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ లో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీం దేశవ్యాప్త నిరసనలకు కారణమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఈ స్కీంనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయం మీద అన్ని రాజకీయ పక్షాలు కలిసి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఒక లేఖ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లాల్సిన సీనియర్ నాయకుడు మనీష్ తివారీ ప్లేట్ ఫిరాయించారు. ” మీతో కలిసి నేను రాలేను ఆ లేఖ మీద సంతకం కూడా పెట్టను” అంటూ మొండికేశారు. ఈ హఠాత్ పరిణామానికి అందరూ ఆశ్చర్యపోయారు. అలా ఎందుకు చేశావు ? అంటూ వివరణ అడిగారు. మనిషి తివారి చాలా తెలివిగా సమాధానం చెప్పారు.” నేను అగ్నిపథ్ స్కీంను ఇష్టం పడటం లేదు. భారత త్రివిధ దళాలను ఆధునికరించే చర్యను సమర్థిస్తున్నాను. భారత్ మాత్రం అమెరికా స్థాయిలో సైనిక పాటవాన్ని కలిగి ఉండకూడదా ” అని ఆయన ఎదురు ప్రశ్నించారు. వైపు రాజునాథ్ సింగ్ అగ్ని పథ్ మీద పార్లమెంటరీ కమిటీ ఎదుట వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సంఘటన జరగటం ప్రతిపక్షాల్లోనూ అనైక్యతను మరోసారి స్పష్టం చేసింది.
Also Read: The Warrior Review: ‘ది వారియర్’ మూవీ రివ్యూ
మనీష్ తివారీకి ఏమైంది
పార్లమెంటరీ కమిటీ ఎదుట వివరణ ఇవ్వాల్సిన సమయానికంటే ముందే స్కీం లో ఉన్న లోటుపాట్ల గురించి గురించి అధికార పక్షానికి తెలపాలని ప్రతిపక్ష నాయకులు అనుకున్నారు. వాస్తవానికి అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అందరితోపాటు మనిష్ తివారీ కూడా వ్యతిరేకించారు. కానీ తీరా లేఖ సమర్పించే సమయానికి ఆయన యూ టర్న్ తీసుకున్నారు. ఆనంద్ శర్మ త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మనిషి తివారీ ప్రవర్తన కూడా ఆ పార్టీలో కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే లేఖలో కాంగ్రెస్ చెందిన ఎంపీ శక్తి సింహ్ గోహిల్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుదీప్ బందోపాధ్యాయ, సౌగతారాయ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుప్రియ సూలే, రాష్ట్రీయ జనతా పార్టీ నుంచి ఏడీ సింగ్ సంతకాలు చేశారు. వాస్తవానికి ప్రతిపక్షాలు అగ్ని పథ్ స్కీమ్ గురించి రకరకాల విమర్శలు చేస్తుండటం, దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతుండడంతో సమస్యకు తక్షణ పరిష్కార మార్గంగా రక్షణ శాఖ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 20 మందిని సభ్యులుగా నియమించింది. ఈ కమిటీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 13 మంది పార్లమెంట్ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు కమిటీలో ఉన్నారు. ఈ బృందంలో ఉన్న మనిశ్ తివారీ గైర్హాజరు అవ్వడమే కాకుండా ఆ లేఖ మీద కనీసం సంతకం కూడా పెట్టలేదు.

గోవాలోను సంక్షోభమే
మొన్నటికి మొన్న మహారాష్ట్రను కోల్పోయిన కాంగ్రెస్.. ప్రతిపక్ష హోదాలో ఉన్న గోవాలో కూడా కల్లోల పరిస్థితినే ఎదుర్కొంటోంది. మూడు నెలల కిందట గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 40 సీట్లలో 20 సీట్లు గెలుచుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 11 స్థానాలు గెలిచి ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించింది. అయితే ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మైకేల్ లోబో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ లో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. నేపథ్యంలో సోనియాగాంధీ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. పార్టీ సీనియర్ నాయకుడు ముకుల్ వాస్నిక్ ను హుటాహుటిన గోవా పంపించారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడటం లేదని మరోసారి తేటతెల్లమైంది
ధిక్కార స్వరాలు ఎందుకు పెరుగుతున్నాయి
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈడి విచారణను ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి జరుగుతున్న విచారణ వల్ల పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం పెరిగిపోతుంది. పైగా మోదీషాలు గట్టి పట్టుదలతో ఉండడంతో సోనియాకి రాహుల్ కు శిక్ష తప్పదేమోనన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్థితిలో పార్టీకి దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు. దీంతో ఏళ్ల నాటి కాంగ్రెస్ లో ధిక్కారస్వరాలు పెరుగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ బిజెపిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడమే ఇందుకు ఉదాహరణ. పార్టీ ఇంత హస్తవ్యస్తమవుతున్నా రాహుల్ గాంధీ మాత్రం ఏదో అంతర్జాతీయ సమస్య మీద మాట్లాడడానికి లండన్ వెళ్లారు. అయితే ఈ పర్యటన చాలా గోప్యంగా ఉండడంతో బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నాయకులే రాజీవ్ గాంధీకి అధికారం కట్టబెడతారని హేళన చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఏం చేస్తారు
ఇక పార్టీ అధిష్టానం పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై వినూత్న తరహాలో నిరసనలు వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే అగ్ని పథ్ స్కీంనకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించింది. త్వరలో కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో నిరుద్యోగ సైరన్ పేరుతో భారీ సభ నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా రాహుల్ గాంధీ హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు జాతీయ స్థాయి నాయకులు పార్టీని వీడి బీజేపీ లో చేరుతుంటే.. తెలంగాణలో మాత్రం అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మనిష్ తివారి లాంటి నాయకుడు అగ్నిపథ్ స్కీం విషయంలో యూటర్న్ తీసుకోగా.. రేవంత్ రెడ్డి లాంటి రాష్ట్ర నాయకుడు అదే స్కీంకు వ్యతిరేకంగా మాట్లాడటం కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని సూచిస్తోంది.
Also Read:Sri lanka Crisis- Sajith Premadasa: శ్రీలంక సంక్షోభాన్ని పరిష్కరించే ఆ కొత్త అధ్యక్షుడు ఎవరు?