Scammers New Tactic: స్మార్ట్ కాలంలో వైట్ కాలర్ దోపిడీలు పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే.. ఊబిలోకి లాగి.. బ్యాంకు ఖాతాలలో ప్రవేశించి.. డబ్బులు మాయం చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. సైబర్ దోపిడీలు పెరిగిపోతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. సైబర్ ముఠా చేస్తున్న దోపిడీల నుంచి జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు.
గతంలో సైబర్ ముఠా నేరగాళ్లు మెసేజ్లు పంపించేవారు. లింకులు పంపించేవారు. ఆ తర్వాత డిజిటల్ అరెస్టులంటూ భయపెట్టేవారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు పాతవిగా మారిపోయాయి. పైగా ఈ వ్యవహారాల మీద పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించడంతో చాలామంది ఇటువంటి వాటిని నమ్మడం లేదు. అయితే ఇప్పుడు సైబర్ ముఠా వ్యక్తులు కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు.
మనదేశంలో ఉన్న సెలబ్రిటీల ప్రైవేట్ వీడియోలంటూ లింకులు పంపిస్తున్నారు.. అవన్నీ నిజమని నమ్మే విధంగా వీడియోలను రూపొందిస్తున్నారు. పొరపాటున ఆ వీడియోను గనుక చూస్తే .. ఇక అంతే సంగతులు. స్కామర్లు దర్జాగా మీ మొబైల్లో ప్రవేశిస్తారు. మీ వ్యక్తిగత ఫోటోల నుంచి మొదలుపెడితే బ్యాంకు ఖాతాల వరకు ప్రతిదానిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. మీరు ఏం చేస్తున్నది.. ఏం చూస్తున్నది.. అన్ని రికార్డు చేస్తారు. ఆ తర్వాత బెదిరింపులు మొదలు పెడతారు. ఎలాగూ మీ వీడియోలు వారి వద్ద ఉంటాయి కాబట్టి.. వారు చెప్పినట్టు చేయాల్సి ఉంటుంది.
ఇటీవల బెంగాల్ యూట్యూబర్ సోఫిక్ ఎస్.కె, దుస్తు సోనాలి ప్రైవేట్ వీడియోలంటూ స్కామర్లు ఆన్లైన్లో పెట్టారు. ఆ తర్వాత ప్రముఖ గేమర్, యూట్యూబ్ పాయల్ ప్రవేట్ వీడియో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అవన్నీ నిజం కావు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా రూపొందించిన వీడియోలు. హాయ్ ప్రొఫైల్ వ్యక్తుల ప్రైవేట్ వీడియోలను రూపొందించి.. వాటిలో ప్రమాదకరమైన మాల్ వేర్ ను ప్రవేశపెడుతున్నారు. తద్వారా ఆ వీడియోలు చూసినవారు సైబర్ ముఠా వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిపోతున్నారు.
తాజాగా మధ్యప్రదేశ్లో సత్నాలో వింధ్య ట్రేడ్ ఫెయిర్ జరిగిన ఓ వీడియో అని ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. అక్కడ మహిళల మూత్రశాలలో.. రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు రూపొందించినట్టు స్కామర్లు పేర్కొన్నారు. వాస్తవానికి అదంతా నిజం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా రూపొందించిన వీడియోలు అవి. అందులో ప్రమాదకరమైన మాల్ వేర్ ప్రవేశపెట్టి.. దోచుకోవడానికి సైబర్ ముఠా రూపొందించిన పన్నాగం అది. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాటుమాటు వీడియో అని.. చూసి సంతృప్తి పొందుతామని భావిస్తే.. జేబుకు చిల్లు పడుతుందని.. నోట్లో నుంచి వచ్చిన సొల్లు మాత్రమే మిగులుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.