Savitribai Phule Jayanti 2026: భారతదేశపు తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే పనిచేశారు. స్త్రీలకు అక్షరజ్ఞానం ఎందుకు ఉండాలి? వారు చదువుకుంటే సమాజం ఏ విధంగా బాగుపడుతుంది? అనే విషయాలపై ఉద్యమం కూడా చేశారు. ఆమె బోధనలు.. సాధికారమైన విషయాలు.. సమానత్వం కోసం చేసిన పోరాటాలు.. నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా.. ఆమె రూపొందించిన సూక్తులు.. సమాజం పై చూపించిన ప్రభావం.. ఈ అంశాలపై ప్రత్యేక కథనం.
ప్రతి ఏడాది జనవరి 3న దేశవ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహిస్తారు. మన దేశంలో అత్యంత శక్తివంతమైన సంస్కర్తలలో సావిత్రిబాయి పూలే ఒకరు. ఈమె విద్యావేత్త, కవయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి. పరదేశంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలు. మహిళల జీవితంలో గణనీయమైన మార్పులు రావాలని ఆమె ఉద్యమాలు చేశారు. నాటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై పోరాటాలు చేశారు. సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం వల్లే నేడు మహిళలు అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారు. పురుషులకంటే దీటుగా పనిచేయగలుగుతున్నారు. నింగి నుంచి నేల వరకు ప్రతి విభాగంలోనూ సత్తా చాటుతున్నారు.
మహిళల్లో అసమానతలను రూపుమాపడానికి సావిత్రిబాయి పూలే విశేషంగా కృషి చేశారు. అంతేకాదు నాటి సమాజంలో మార్పు కోసం ఆమె అద్భుతమైన సూక్తులను రూపొందించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఒకసారి ఆమె రూపొందించిన సూక్తులను మననం చేసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.
1.ఖాళీగా కూర్చోకు.. వెళ్లి చదువుకో..
2.మేల్కొను.. నిద్రావస్థ నుంచి బయటికి రా.. బోధనలు విను. సంప్రదాయాలను పగలగొట్టు.. చాందస విధానాలను దూరం పెట్టు.. విముక్తి వైపు అడుగు వెయ్..
3.సమాజం చూపిస్తున్న అణచివేత ఎప్పటికైనా ప్రమాదం. దాని నుంచి మీ ధైర్యాన్ని ఎప్పటికీ నాశనం చేసుకోవద్దు.
4.చీకటిని తొలగించడానికి విద్య ఒకటే మార్గం. అదే సమాజ ఉన్నతికి కీలకం.
5.బలమైన మహిళలు కఠినమైన పరిస్థితుల నుంచి ఉద్భవిస్తారు.
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగల సందేశాలు ఇవి
సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు. లక్షలదిమందికి విద్యను అందించిన భారతదేశపు తొలి మహిళ ఉపాధ్యాయురాలికి వందనం.
సావిత్రిబాయి పూలే జయంతి నాడు అందరికీ విద్య, సమానత్వం, గౌరవం లభించాలి. ఆమె కొనసాగించిన వారసత్వాన్ని నిలబెట్టాలి.
మహిళల హక్కులకు నిజమైన మార్గదర్శకురాలు సావిత్రిబాయి పూలే. ఆమెను స్మరించుకుంటూ.. ఆమె చూపించిన బాటలో నడవాలి.
తన సంకల్పంతో బలమైన పోరాటాలు చేశారు. స్త్రీలలో విద్యావ్యాప్తికి కృషి చేశారు. ఆమె పోరాటం అసమానం.. ఆమె త్యాగం అనన్య సామాన్యం.