భారతదేశపు ప్రసిద్ధ కళాకారులలో ఒకరైన పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత సతీష్ గుజ్రాల్(94) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నాడు. గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. సతీష్ గుజ్రాల్ పలు కళల్లో ఆరితేరారు. ఆయన మురలిస్ట్ గా, చిత్రకారుడిగా, వాస్తుశిల్పి, డిజైనర్ గా, కవితా ప్రేమికుడిగా పేరు సంపాందించుకున్నారు. గుజ్రాల్ రచనలకుగాను కేంద్రం పద్మ విభూషణ్ అవార్డు అందజేసి సత్కరించింది. సతీష్ గుజ్రాల్ సోదరుడు దివంగత ఇందర్ కుమార్ గుజ్రాల్(ఐకే గుజ్రాల్) భారత ప్రధానిగా పని చేశారు.
సతీష్ గుజ్రాల్ దేశ రాజధాని ఢిల్లీలోని హైకోర్టు ముఖభాగాన్ని అలంకరించే వర్ణమాల కుడ్యాన్ని డిజైన్ చేశారు. అలాగే ఢిల్లీలోని బెల్జియన్ రాయబార కార్యాలయాన్ని రూపొందించడంలో సతీష్ గుజ్రాల్ సేవలను అందించారు. గుజ్రాల్ చిన్నతనం నుంచే కళలపై మక్కువ పెంచుకున్నారు. 1925లో లాహోర్లో జన్మించిన గుజ్రాల్ దేశ విభజన వంటి భయానక పరిస్థితులను చవిచూశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సతీష్ గుజ్రాల్ తరచూ కవితల రూపంలో ప్రేమను చూపుతుండేవారు. ‘ఫైజ్ అహ్మద్ ఫైజ్’, ‘గాలిబ్’ వంటి కవితలను రాశారు. లాహోర్లో తన అన్నయ్య ఇందర్ గుజ్రాల్ తో కలిసి కవిత్వ పఠన సమావేశాలకు వెళ్లేవారు. సతీష్ గుజ్రాల్ మృతిపట్ల భారత ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.