Delhi Liquor Scam- Kanika: జెట్ సెట్ గో.. ఉబెర్, ఓలా తరహాలో దేశంలో చార్టర్డ్ విమానాల సేవలను అందించే సంస్థ. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు కనిక టెక్రియాల్ రెడ్డి. ఈమె వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడి సతీమణి. ఢిల్లీ లిక్కర్ స్కాం లో హవా మార్గంలో ఈమె సంస్థకు సంబంధించిన విమానాల్లోనే నగదును ఢిల్లీకి చేరవేచ్చారని తెలుస్తోంది.. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈమె పేరు వెల్లడించిన నేపథ్యంలో లోతుగా పరిశీలిస్తే ఎన్నో విస్మయకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

మార్వాడి కుటుంబంలో పుట్టింది
కనిక అలియాస్ కనికా టెక్రియాల్ రెడ్డి మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలోని ఓ మార్వాడి కుటుంబంలో పుట్టింది. ఈమె 22 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బారిన పడింది.. విదేశాల్లో కీమోథెరపీ చేయించుకుని ఆ వ్యాధిని జయించింది. అనంతరం ఆమె ఈ చార్టర్డ్ విమానయాన సంస్థను నెలకొల్పింది. దీనిని “ఉబెర్ ఆఫ్ ది స్కైస్” అని పిలుస్తారు. కనిక భోపాల్ లో పుట్టినప్పటికీ తొమ్మిదో తరగతి దాకా ఊటీ లోని లారెన్స్ పబ్లిక్ స్కూల్లో చదివింది. పదో తరగతి సమయానికి ఆమె తల్లిదండ్రులు భోపాల్ తీసుకు వచ్చారు. అక్కడే ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ముంబైలో విజువల్ కమ్యూనికేషన్ అండ్ డిజైనింగ్ లో డిప్లమా చేసింది. లండన్ లోని కోవెంటరీ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. అయితే అక్కడ చదువుతున్నప్పుడు ఆమె ఏరోస్పేస్ రిసోర్సెస్ లో పనిచేశారు.. ఒక దశలో పైలెట్ కావాలి అనుకున్నారు. కారణాలు తెలియదు కాని దానిని మధ్యలో విరమించుకున్నారు. ఇదే సమయంలో చార్టర్డ్ విమానాల మార్కెట్ కు భారతదేశంలో ఉన్న విస్తృతి గురించి తెలుసుకొని 2011లో లండన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు.
క్యాన్సర్ బారిన పడింది
లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కనిక హాడ్గ్ కిన్స్ లింఫోమా క్యాన్సర్ బారిన పడ్డారు. దానికి చికిత్స చేయించుకొని బయటపడ్డారు.. అయితే అంతకుముందే సంస్థ ఏర్పాటు గురించి తల్లిదండ్రులకు చెప్తే వారు ఒప్పుకోలేదు.. దీంతో ఢిల్లీకి వెళ్లి 2014లో జెట్ సెట్ గో ను ప్రారంభించారు. తన మదిలో మెదిలిన ఆలోచనకు తల్లిదండ్రులు కార్యరూపం ఇవ్వకపోవడంతో కొద్దిరోజులు వారితో ఆమె మాట్లాడలేదు. అయినప్పటికీ తాను అనుకున్న దారిలోనే కొనసాగారు.

హవా మార్గంలో ఎందుకు తరలించినట్టు
శరత్ చంద్రారెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత కనిక ఫేట్ మారిపోయింది. వీ వీఐపీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే సంస్థ భారీ లాభాల్లోకి వెళ్ళేందుకు ఈ హవా మార్గం ద్వారా డబ్బు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి . దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాల తరహాలో బేగంపేట విమానాశ్రయంలో కూడా స్క్రీనింగ్ పాయింట్ లేకపోవడం, వీఐపీల వాహనాలు నేరుగా రన్ వే పై విమానాల దగ్గరికి వెళ్లే వీలు ఉండటం వంటి వెసలు బాట్లను ఉపయోగించుకొని డబ్బు తరలించారని తెలుస్తోంది. అయితే అధికారులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.