Nadimidoddi Anjamma: ఆమె చదువుకోలేదు. కానీ నేల గొప్పతనం తెలుసు. విత్తనం విలువ తెలుసు. ప్రకృతిని కాపాడాలంటే ఏ పద్ధతిలో సాగు చెయ్యాలో తెలుసు. ఆమె మారుమూల పల్లెకు చెందిన సామాన్యురాలు. కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా.. 30 రకాల చిరుధాన్యాల పంటలు పండించి ‘విత్తన సంరక్షణ’ నిధిని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు పొందిన ఆమె మన తెలుగు మహిళ.. నడిమిదొడ్డి అంజమ్మ. జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా విత్తనాల విప్లవకారిణిగా గుర్తింపు పొందింది.
తెలంగాణ మహిళ..
అంజమ్మ సొంత ఊరు సంగారెడ్డి జిల్లా గంగ్వార్, అది తెలంగాణ , కర్ణాటకలోని ఒక సరిహద్దు ప్రాంతం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆమె బడి ముఖమైనా చూడలేదు. పదేళ్ల వయసులోనే.. సమీపంలోని గంగ్వార్‌కు చెందిన సంగప్పతో వివాహం జరిగింది. ‘అప్పట్లో మాకు రెండు పూటలా భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ కూలీగా. జీవితాన్ని మొదలుపెట్టాను‘ అంటూ నాటి రోజులను గుర్తు చేసుకుంటు, క్రమ క్రమంగా ఒక అర ఎకరం భూమిని ఆ దంపతులు సమకూర్చుకున్నారు. సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం ప్రారంభించారు. అదే సమయంలో… ఆ ప్రాంతంలో సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి జహీరాబాద్ ప్రాంతంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) కార్యక్రమాలు చేపట్టింది. అ సొసైటీలో అంజమ్మ సభ్యురాలుగా చేరింది. డీడీఎస్ సహకారంతో తన పొలంలో చిరుదాన్యాలు సాగు చేసింది.
అర ఎకరం నుంచి పది ఎకరాల భూమికి..
కొత్త మెలకువలను తెలుసుకుంటూ, వివిధ రకాల పంటలు వేసింది. ఆమె శ్రమ మంచి ఫలితాలను ఇచ్చింది. 30 ఏళ్ళ కాలంలో అర ఎకరం నుంచి పది ఎకరాల భూమికి యజమానురాలుగా చేరుకున్నారు. నూనె గింజలు, పప్పు దినుసులు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు తదితర చిరుధాన్యాలు పండించారు. ఇప్పటి వరకూ 80 రకాల చిరుధాన్యాలతో విత్తన సంపదను సృష్టించారు.
విత్తన సంరక్షణ నిధి ఏర్పాటు..
తాము పండించిన పంటల నుంచి కొంతమొత్తాని విత్తన సంరక్షణ నిధి పేరుతో నిల్వ చేస్తున్నారు. ఈ నిధిలోని విత్తనాలను ఆమె ఎవరికి విక్రయించరు. అవసరమయ్యే రైతులకు ఉచితంగా ఇస్తారు. వారికి దిగుబడి వచ్చాక రెట్టింపు విత్తనాలు తీసుకొని మళ్లీ భద్రపరుస్తారు. స్థానిక వాతావరణానికి అనుగుణంగా వివిధ రకాలను పండిస్తున్న అంజమ్మను మొక్కల జీవ వైవిధ్యం. పరిరక్షకురాలుగా 2019లో కేంద్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది.
అంతర్జాతీయ గుర్తింపు..
అంజమ్మకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. విత్తన సంరక్షకురాలుగా ఖ్యాతి పొందిన అంజమ్మ నాగాలాండ్, బీహార్, మేఘాలయ, ఒడిశా, అసోంతో సహా 22 రాష్ట్రాల్లో పర్యటించారు. విత్తన సంరక్షణ, సేంద్రియ ఎరువులు తయారీ, మహిళా సంఘాల నిర్వహణ తదితర అంశాల్లో తన అనుభవాలను అక్కడివారితో పంచుకున్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ విభాగం ప్రపంచస్థాయిలో చిరుధాన్యాల రైతులపై అధ్యయనం చేపట్టింది. చిరుధాన్యాలు పండించడం, విత్తనాలను అందజేయడం ద్వారా వాటి సాగును ప్రోత్సహించడంలో అంజమ్మ కృషిని ఆ విభాగం గుర్తించి, ప్రశంసలు అందించింది.
ఒక సాధారణ మహిళ అంతర్జాతీయ స్థాయిలో పొందిన ఈ గుర్తింపు జహీురాబాద్ ప్రాంతానికి గర్వకారణమని పలువురు ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు. చిరుదాన్యాలను పండిస్తే మనకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. పశువులకు, పక్షులకూ కూడా ఇవి మేలు చేస్తాయి అని చెబుతోంది 63 ఏళ్ల అంజమ్మ .