
నేడు క్రిస్మస్.. మరో ఐదారు రోజుల్లో కొత్త సంవత్సరం వేడుక రాబోతోంది. మరోవైపు కరోనా ఉపద్రవం అలాగే పొంచి ఉంది. కరోనా సెకండ్ వేవ్ వస్తోందంటూ ప్రచారం కూడా ఊపందుకోవడంతో రాష్ట్రాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 26 నుంచి జనవరి 1 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
కానీ.. కొత్త విషయం ఏంటంటే వేడుకలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం కిక్ ఇచ్చే విషయంలో మాత్రం వెనక్కి పోలేదు. రెండు రోజులు డిసెంబర్ 31, జనవరి 1న ప్రభుత్వ మద్యం దుకాణాలనన్నింటినీ మూసివేస్తారన్న ప్రచారం జరిగింది. మద్యపానానికి వ్యతిరేకమైన ప్రభుత్వం ఆదాయం గురించి పట్టించుకోకుండా.. ఆ పని చేస్తుందని అనుకున్నారు. మద్యం దుకాణాలు మూసివేయడం కానీ.. సమయాలను తగ్గించడం కానీ చేయడం లేదు. మొత్తంగా కొత్త సంవత్సర వేడుకలకు యథావిధిగా మద్యం దుకాణాలు, బార్లు తెరుచుకుంటాయని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
దుకాణాలు, బార్లపై నిషేధం లేదని స్పష్టం చేసింది. మద్యం దుకాణాలు రాత్రి తొమ్మిది గంటల వరకు.. బార్లు రాత్రి పది గంటల వరకూ ఉంటాయని చెప్పింది. దీంతో నయాసార్ జోష్‌ను అస్వాదించాలనుకునే మందుబాబులకు కాస్త ఊరట లభించినట్లయింది. లేకపోతే.. పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెట్టి.. అక్కడే న్యూ ఇయర్‌కు వెల్కం చెప్పేందుకు ప్లాన్ చేసుకునేవారు. అయితే.. బ్రాండ్లు మాత్రం ఎప్పటివే దొరుకుతాయట. వాటితోనే సరిపెట్టుకోవాలి. వర్జినల్ బ్రాండ్లు కోసం అయితే పక్క రాష్ట్రాలకు పోవాల్సిందే.
మరోవైపు.. తమ ప్రభుత్వానికి మద్యం ఆదాయ వనరు కాదని చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇటీవల తన విధానాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. మద్యందుకాణాల సమయాన్ని పెంచడం, రేట్లు తగ్గించడం.. వంటి సంస్కరణలు చేపట్టింది.ఇక మద్యం వినియోగాన్ని పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇంత కాలం మద్య నిషేధం చేస్తామని చెబుతూ వచ్చిన ప్రభుత్వం.. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఆదాయం కోసమేనని అంచనా వేస్తున్నారు. కొత్తగా తీసుకుంటున్న అప్పులకు మద్యం ఆదాయాన్ని గ్యారంటీగా పెడుతున్నారు అంటే.. ఇక మద్యం నిషేధం విషయాన్ని సర్కార్ మరిచిపోయినట్లుగానే అర్థం చేసుకోవచ్చు.