Samvidhan Hatya Diwas : మనదేశంలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ కాలాన్ని.. సంవిధాన్ హత్యా దివాస్ గా జరుపుకోవాలని శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా పిలుపునివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. దీనికి తోడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలకమైన ట్వీట్ చేయడంతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ఇటీవలి కాలం నాటి పార్లమెంట్ ఎన్నికల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ “జూన్ 25 న సంవిధాన్ హత్యా దివాస్ గా ప్రకటించాం. రాజ్యాంగానికి ఏం జరిగిందనేది ఆ రోజుల్లో ఉన్నవారికి తెలుసు. రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించారు.. అది ప్రజాస్వామ్యానికి బ్లాక్ స్పాట్ గా మారింది.. బాధ్యత గల ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి, రాజ్యాంగాన్ని పూర్తిగా తిరస్కరించి, దేశాన్ని జైలుగా మార్చిన రోజును కొత్త తరం ఎప్పటికీ మర్చిపోదని” అంటూ చేసిన ట్విట్టర్ ఎక్స్ లో ట్వీట్ చేయడం.. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఘాటుగా స్పందించడంతో దేశ రాజకీయాలు మరోసారి గరం గరంగా మారాయి.
జూలై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్ మొదలుకానుంది.. ఈ సభలకు తాము పూర్తి శక్తితో మణిపూర్ సమస్యను పార్లమెంటులో లేవనెత్తుతామని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించిన ఒక రోజు తర్వాత కేంద్రం సంవిధాన్ హత్యా దివాస్ ను ప్రకటించడం విశేషం. ఇటీవల కాలంలో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ “రాజ్యాంగాన్ని రక్షించండి. రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందని” పేర్కొంటూ ఎన్నికల సమయంలో ప్రచారాన్ని మొదలుపెట్టింది. దీనిని ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కొనసాగిస్తోంది.
వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు “అబ్ కీ బార్ 400 పార్” అని ప్రధాని నరేంద్ర మోదీ నినదించారు. ఎన్నికల ప్రచార సభల్లో ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. అయితే మోదీ నినాదం ఎన్నికల్లో పనిచేయలేదు. పైగా ఇండియా కూటమి గణనీయంగా సీట్లను సాధించింది. సహజంగానే ఇది మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించింది. ఈ సమయంలో కాంగ్రెస్, అది ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలోని పార్టీలను నిలువరించేందుకు సంవిధాన్ హత్యా దివాస్ ను తెరపైకి తీసుకువచ్చింది. అంతేకాదు లోక్ సభ లో ఎమర్జెన్సీని నిరసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా ఎమర్జెన్సీని ఖండిస్తూ తీర్మానాన్ని చదివారు. భారతదేశ చరిత్రలో 1975 వ సంవత్సరంలో జూన్ 25న జరిగిన ఎమర్జెన్సీ ఒక దినంగా నిలిచిపోతుందన్నారు. “1975 నాటి ఎమర్జెన్సీ ని ఈ సభ వ్యతిరేకిస్తోంది. నాటి రోజుల్లో బలంగా, దృఢంగా ఉన్న వారందరి సంకల్పాన్ని మేము అభినందిస్తున్నాం. వారంతా ఎమర్జెన్సీని వ్యతిరేకించారు. దూరమైన పోరాటం చేశారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యతను స్వీకరించారు. ఆ చీకటి కాలంలో నియంతృత్వ ప్రభుత్వం చేతిలో ప్రాణాలు కోల్పోయిన భారత దేశ పౌరుల జ్ఞాపకార్థం మేము రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తున్నామని” ఓం బిర్లా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం మణిపూర్ లో నెలకొన్న అల్లకల్లోలం, నీట్ పేపర్ లీకేజీ వంటి ఘటనలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ఎన్డీఏను పదేపదే ప్రశ్నిస్తున్నాయి. వచ్చే పార్లమెంట్ సెషన్ లో వీటి గురించే తాము ప్రస్తావిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. అయితే వీటిని ఎదుర్కొనేందుకే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి సంవిధాన్ హత్యా దివాస్ ను తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దీని ద్వారా ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీని ఒంటరి చేయడమే మోదీ – అమిత్ షా లక్ష్యంగా కనిపిస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో ప్రస్తుతం ఉన్న ఇండియా కూటమిలోని పార్టీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆ పార్టీలు గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీశాయి. మోదీ – షా తీసుకొచ్చిన సంవిధాన్ హత్యా దివాస్ ఆ పార్టీలపై ప్రభావం చూపించలేకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు..
“మోదీ చేసిన ట్వీట్ కు మల్లికార్జున ఖర్గే దీటుగా బదులిచ్చారు. మణిపూర్ లో జరుగుతోంది సంవిధాన్ హత్య, ఇంకా చాలా ప్రాంతాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఇన్ని చేస్తున్న మీరు ఎప్పుడో జరిగిన ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడం సరికాదు. దీన్నే పలాయాన వాదం అంటారని ఖర్గే అన్నారు. వచ్చే రోజుల్లో పార్లమెంట్ లో అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి నాయకుల మధ్య హాట్ హాట్ చర్చ జరగడం ఖాయమని” రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.