రాష్ట్రంలోనే టిడిపికి బలమైన జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటి. మొత్తం రాయలసీమలో కుప్పం నుండి చంద్రబాబునాయుడు కాకుండా టిడిపి గెలుపొందింది ఈ జిల్లా నుండే. చంద్రబాబునాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణతో పాటు ఈ జిల్లా నుండి కేశవ శాసనసభకు గత ఎన్నికలలో ఎన్నికయ్యారు.
అయితే ప్రస్తుతం వైసిపి ప్రభంజనంలో ఈ జిల్లాలో టిడిపి కోలుకోలేని విధంగా దెబ్బ తింటున్నది. జిల్లా రాజకీయాలను శాసిస్తూ వస్తున్న జేసీ దివాకరరెడ్డి ఇప్పుడు అస్త్రసన్యాసం చేశారు. తన మనుషులు ఎవ్వరు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
మరోవంక తొలినుండి టిడిపికి జిల్లాలో పెట్టనికోటగా ఉంటూ వస్తున్న పరిటాల రవి కుటుంభం సభ్యులు పార్టీకి దూరం అయ్యేందుకు చూస్తున్నారు. కాంగ్రెస్ నుండి వచ్చిన జేసీకి ప్రాధాన్యత ఇస్తూ, తొలి నుండి పార్టీలో ఉన్నవారిని విస్మరిస్తున్నారని అసంతృత్తిపని వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వైసిపిలో చేరబోతున్నట్లు సంకేతం ఇచ్చారు. ఇప్పటికే కొందరు వైసిపి నేతలతో సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు .
ఇలా ఉండగా, తాజాగా ప్రముఖ దళిత నేత. మాజీ మంత్రి శమంతక మని పార్టీని వీడారు. ప్రస్తుతం ఎమ్యెల్సీగా ఉన్న ఆమె తన కుమార్తె, మాజీ ఎమ్యెల్యే యామినిబాలతో కలసి మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసిపి లో చేరారు.
వీరిని సాదరంగా పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ తమ అనుచరులతో కలిసి వైసిపి లోకి వచ్చారు.
టిడిపి లో శమంతకమణి సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఓసారి శింగనమల ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టిడిపి లో ముఖ్యనేతగా ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు.
2019 లో మాజీ ఎంపి జేసీ దివాకర్‌రెడ్డి, జిల్లా నేతల సలహాతో శింగనమల నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబు మార్చారు. అప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు.
తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు శమంతకమణి విఫల ప్రయత్నాలు చేశారు. నేరుగా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. పార్టీ అభివఅద్ధికి ఎంతో కఅషి చేసినా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి పార్టీనే నమ్ముకున్న వారిని దూరం చేశారంటూ అప్పట్లో బహిరంగంగానే వాపోయినా ప్రయోజనం లేకపోయింది.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న వారు.. దళితులను పక్కన పెడుతున్నారనే మనస్తాపంతో ఆమె పార్టీని వీడినట్లు తెలుస్తున్నది.