Samajika Sadhikara Bus Yatra: వైసిపి సామాజిక సాధికార యాత్ర పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. తొలివిడతగా రాష్ట్రంలో ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. అయితే కూడళ్ళు, మార్కెట్ సెంటర్లలో సభలు ఏర్పాటు చేశారు. రోడ్లను దిగ్బంధం చేశారు. అయితే ఆశించిన స్థాయిలో జనాల నుంచి ఆదరణ దక్కలేదు. అటు పార్టీలో సైతం అసంతృప్తులు బయటపడ్డాయి. కొందరు పెద్దలు ముఖం చాటేశారు. ఎమ్మెల్యేలు సైతం తమకెందుకులే అన్నట్టు వ్యవహరించారు. మొత్తానికైతే తొలిరోజు యాత్ర హై కమాండ్ ఆశించిన స్థాయిలో జరగలేదు.
ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, దక్షిణ కోస్తాకు సంబంధించి గుంటూరు జిల్లా తెనాలి, రాయలసీమకు సంబంధించి అనంతపురం జిల్లా సింగనమలలో యాత్రలు ప్రారంభమయ్యాయి. కానీ నేతల మధ్య సమన్వయం లోపించింది. జన సమీకరణలో విఫలమయ్యారు. రోడ్ల కూడళ్ళలో, మార్కెట్ సెంటర్లలో జనం గుమికూడతారని భావించి నడిరోడ్డుపై సభలు జరిపారు. అయినా ప్రజల్లో స్పందన లేదు. జగన్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు ఈ నాలుగున్నరేళ్లలో చేసిన సాయం గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకోలేకపోయారు. కేవలం చంద్రబాబు, పవన్ లపై విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారు. కొంతమంది సీనియర్లు సైతం ముఖం చాటేశారు. అనంతపురం జిల్లా సింగనమల లో చేపట్టిన బస్సు యాత్రకు హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సభా వేదిక పైకి వెళ్లకుండా కిందకి పరిమితమయ్యారు. ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డి హాజరు కాలేదు. సభ జరుగుతుండగానే ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సిద్ధారెడ్డి వెళ్లిపోవడం వైసిపి నేతలకి ఆశ్చర్యానికి గురిచేసింది.
గుంటూరు జిల్లా తెనాలి సభలో వైసీపీ నేతలకు.. మాదిగ నేతలు షాక్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక దళితవాడల్లో అభివృద్ధి జరగలేదు. కనీసం ఒక్క ఉపాధి అవకాశాన్ని కూడా కల్పించలేకపోయారు. వైసిపి అధికారంలోకి రావడానికి అధిక ఓట్లున్న మాదిగ సామాజిక వర్గమే కారణం. కానీ మాకు పార్టీలో ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది. అయినా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలకు న్యాయం జరిగిందని ఎలా చెబుతారు? అంటూ ప్రశ్నించడంతో వైసీపీ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సభకు స్పీకర్ తమ్మినేని సీతారాం డుమ్మా కొట్టారు. అక్కడ కేవలం గంట మాత్రమే సభ జరిగింది. కానీ ప్రజలకు రోజంతా ఆంక్షలు పెట్టారు. నడిరోడ్డుపై బహిరంగ సభ నిర్వహించారు. అటు సభలో సైతం మంత్రులు చంద్రబాబు, పవన్ను టార్గెట్ చేసుకుని మాట్లాడారు. అసలు లక్ష్యాన్ని మరిచిపోయారు.