AP Salaries Delayed: దసరా సమీపిస్తోంది. అక్టోబర్ మూడో వారం పూర్తవుతోంది. అయినా ఇంతవరకు జీతాలు పడలేదు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏ నెలలోనూ ఉద్యోగులకు పదో తేదీ లోపు జీతాలు అందడం లేదు. అందరికంటే చివరిగా జీతాలు పడేది ఉపాధ్యాయులకే. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు అందించే పింఛన్ల గురించి చెప్పనవసరం లేదు. సెప్టెంబరు నెలకు సంబంధించి పెన్షన్లను సైతం ఈనెల 16 వరకు అందిస్తూనే ఉన్నారు.
విపక్షంలో ఉన్నప్పుడు జగన్ తరచూ ఒక ప్రకటన చేసేవారు. ” ప్రభుత్వ ఉద్యోగి ముఖంలో చిరునవ్వు కనిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు రావాల్సినవన్నీ సమయానికి వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నా ” అంటూ ప్రతి సందర్భంలోనూ చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆపసోపాలు పెడుతున్నారు. ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారు. ఈ నెల 23న దసరా ఉండగా.. ఈనెల 16 వరకు సెప్టెంబర్ నెలకి సంబంధించి జీతాల చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే పక్కాగా ఒకటో తేదీ జీతం పడేది. అవసరమనుకుంటే పిఎఫ్ నుంచి అడ్వాన్స్ ని తీసుకోవచ్చు. రుణాల సదుపాయం, ఆర్జిత సెలవులు, ఎప్పటికప్పుడు డిఏలు, పి ఆర్ సి ల తో పెరిగే జీతం.. ఇలా ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి వేరు. కానీ జగన్ ఉద్యోగులను వీటన్నింటికీ దూరం చేశారు. సకాలంలో జీతాలు సైతం చెల్లించడం లేదు.
ఆలస్యంగా వచ్చిన జీతాలను చూసి మురిసిపోయిన వారు ఉన్నారు. అటువంటివారు హమ్మయ్య.. మా జీతాలు పడ్డాయి అంటూ వాట్సాప్ లో మెసేజ్ లు పెట్టుకుంటున్నారు. జీతాలు ఆలస్యమయ్యాయి అన్న బాధతో పాటు.. ఎప్పటికైనా వచ్చాయి అంటూ సంతృప్తి చెందిన వారు ఉన్నారు. అటు జీతాలు రాని వారు మాత్రం జగన్ సర్కార్ చర్యలను దుమ్మెత్తి పోస్తున్నారు. పోనీ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతామంటే కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ జీతం డిసెంబర్ 13 వరకు పడలేదు. దీంతో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొందరిపై బైండోవర్ కేసులు సైతం నమోదు చేశారు. అందుకే ఇప్పుడు దసరా వరకు జీతం రాకపోయినా చాలామంది లోవలోపల బాధపడుతున్నారే కానీ.. బాధను బయటకు వ్యక్తం చేయడం లేదు. ఏరి కోరి జగన్ ప్రభుత్వాన్ని కోరుకున్నామని.. జగన్ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డామని… అందుకు తగిన శాస్తి జరిగిందని ఉద్యోగ, ఉపాధ్యాయులు చెబుతున్నారు.