Saddula Bathukamma: తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. పూర్వ కాలం నుంచి పువ్వులను పూజించే పండుగ కావడం విశేషం. దీనికోసం సుమారు పదిరోజులు వేడుక నిర్వహించడం చూస్తున్నాం. ఎంగిలిపూలతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటిలో మహిళల సందడి కనిపిస్తోంది. పండుగ వేళ ఎప్పుడు రాని అనుమానం ఈసారి పండితుల్లో వచ్చింది. సద్దుల బతుకమ్మ ఎప్పుడు నిర్వహించుకోవాలనే దానిపై తర్జనభర్జన జరుగుతోంది.

సద్దుల బతుకమ్మ పండుగను కొండపాక, వేములవాడ లలో ఏడు రోజులకు ఆడతారు. కానీ కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11 లేదా 13 రోజులు ఆడతారు. పురోహితులు, పండితులు బతుకమ్మ తేదీలు నిర్ణయించి పండుగను జరపడం ఆనవాయితీ. రాష్ర్ట ప్రభుత్వం రాష్ర్ట పండుగగా గుర్తించి బతుకమ్మ వేడుకలు నిర్వహించడం తెలిసిందే. కానీ ఈసారి మాత్రం సద్దుల బతుకమ్మపై సందిగ్ధం నెలకొంది.
రాష్ర్ట ప్రభుత్వం మాత్రం బతుకమ్మ పండుగను బుధవారమే నిర్వహించుకోవాలని చెబుతోంది. పండితులు మాత్రం బతుకమ్మ పండుగ గురువారం నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో పండుగ నిర్వహణపై ఎవరికి ఇష్టమొచ్చినట్లుగా వారు జరుపుకుంటున్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ పరిషత్ మాత్రం గురువారం జరుపుకోవాలని చెబుతున్నారు.
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ ముగింపు ఉథ్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వేములవాడలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు యంత్రాంగం నిర్ణయించింది. దీంతో ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. వేములవాడలో మంగళవారమే బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.