రాజస్థాన్ రాజకీయాల్లో కుదుపు మొదలైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించిన నేతల మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు నెలకొన్నాయి. పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ప్రచారంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే టాక్ స్థానిక నేతల్లో ఉంది. మద్దతుదారులు చెబుతుంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో సీఎం రేసులో అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ పేర్లు చివరి వరకు విన్పించాయి. సీనియర్ అయిన అశోక్ గెహ్లట్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపడంతో సచిన్ పైలట్ కి సీఎం పదవీ దూరమైంది.
కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలట్ కు డిప్యూటీ సీఎం పదవీ కట్టబెట్టి నచ్చజెప్పింది. సీఎం గెహ్లట్ క్యాబినెట్లో సచిన్ పైలట్ కొనసాగుతూ వస్తున్నారు. అయినప్పటికీ వీరిమధ్య తరుచూ విబేధాలు చోటుచేసుకున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే క్రమంలో బహిరంగంగానే ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లింది. ఈక్రమంలోనే వీరిమధ్య విబేధాలు తారస్థాయిలోకి చేరడంతో సచిన్ పైలట్ తన మద్దతుదారులకు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని సీఎం గెహ్లాన్ వర్గం ఆరోపణలు చేసింది.
సచిన్ పైలట్ తన మద్దతు దారులతో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నించింది. తాజాగా జైపూర్లో జరిగిన సీఎల్పీ బేటికి సచిన్ పైలట్ రెండోరోజు కూడా గైర్హాజరయ్యారు. దీంతో పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సచిన్ పైలట్ ను పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవీ నుంచి తప్పించింది. ఆయన స్థానంలో పీసీసీ చీఫ్ గా గోవింద్ సింగ్ దోత్సారాను నియమించినట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది.
దేశంలో పార్టీలు, వాటి స్థితిగతులు
కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలట్ తో ఆరుసార్లు సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలట్ బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగమయ్యాడని అధిష్టానం భావించడంతో పైలట్‌తోపాటు ఆయన మద్దతుదారులను పార్టీ పదవుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో రాజస్థాన్ రాజకీయాలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
జైపూర్లో నిర్వహించిన సమావేశంలో 102మంది ఎమ్మెల్యేలు పాల్గొని సచిన్ పైలట్ ఉద్వాసనకు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం సీఎం గెహ్లట్ గవర్నర్‌ను కలిసి ప్రస్తుత పరిణామాలు, కేబినెట్ పునర్ఃవ్యవస్థీకరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సచిన్ పైలట్‌కు ఆయన మద్దతుదారులతో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన మద్దతుదారులు మాత్రం బీజేపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారట.
దీంతో సచిన్ పైలట్ సొంత పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సచిన్ పైలట్ బీజేపీలో చేరతారా? లేదా సొంత పార్టీ పెడుతారా? అనేది త్వరలోనే తేలడం ఖాయంగా కన్పిస్తుంది. అంతవరకు వేచి చూడాల్సిందే..!