Sabarimala Temple Gold Missing: శబరిమల.. కేరళ రాష్ట్రంలో ప్రఖ్యాత దైవ క్షేత్రం. హిందువులు అత్యంత నిష్టతో అయ్యప్ప స్వామి దీక్షను ధరిస్తారు. దీక్షను 41 రోజులపాటు ఆచరించి.. ఆ తర్వాత శబరిమలలో విరమిస్తారు. శబరిమల అనేది దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి భక్తులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అయినప్పటికీ వాటిని భరించి.. చివరికి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత మాలను విరమించి స్వామివారికి కానుకలు సమర్పిస్తుంటారు. కేరళ రాష్ట్రంలో అనంత పద్మనాభ స్వామి వంటి ఆలయం ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో ప్రఖ్యాతలు సంపాదించుకుంది శబరిమల అయ్యప్ప ఆలయం.
కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం సిపిఎం అధికారంలో ఉంది. ఈ పార్టీ కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉంటుంది. హిందూ సమాజం అంటే.. హిందూ దేవుళ్ళు అంటే సిపిఎం కు విపరీతమైన ద్వేషం. విపరితమైన విషం. నిత్యం టన్నులకొద్ది కుమ్మరిస్తూనే ఉంటుంది. ఆమధ్య శబరిమలలో ఆడవారికి ప్రవేశంపై ఎంత రాద్ధాంతం జరిగిందో చూసాం కదా. ఇప్పుడు ఏకంగా స్వామివారి ఆలయంలో బంగారాన్ని మాయం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే శబరిమలలో ఇప్పుడు అయ్యప్ప మాత్రమే మిగిలిపోయాడు. ఆయన దేవుడు కాబట్టి.. బంగారాన్ని దొంగిలిస్తున్నా సరే.. పాపాలను చూస్తూ ఉండిపోయాడు.జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం అయ్యప్ప ఆలయంలో విలువైన వస్తువులు.. ముఖ్యంగా బంగారం మాయం కావడం తో కేరళ హైకోర్టు విస్తృత దర్యాప్తుకు ఆదేశించింది. పరిణామం అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయి. కోర్టు దేవస్థానం బోర్డును తీవ్రంగా మందలించింది.. 2019లో ఆలయ గర్భగుడి.. దానిని మలయాళ భాషలో శ్రీ కోవిల్ అని పిలుస్తుంటారు. గర్భగుడిలో ద్వారపాలక విగ్రహాలకు బంగారు పూత పూయాలని బయటకు తీశారు. ఆ సమయంలో నాలుగు కిలోల బంగారం కనిపించకుండా పోయింది. దీంతో ఈ విషయం హైకోర్టు దాకా వెళ్లడంతో.. హైకోర్టు నేరుగా ఈ విషయంపై స్పందించింది. విలువైన వస్తువులు కనిపించకుండా పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.. వాటన్నింటిపై కూడా జాబితా రూపొందించాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తిని అక్కడి సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. ఈ ఏడాది కోర్టుకు తెలియకుండానే ఆ విగ్రహాలను బంగారు పూత కోసం మళ్లీ బయటికి పంపించడం వివాదాన్ని కలిగిస్తోంది.. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు స్టింగ్ ఆపరేషన్ చేయగా మలయాళ నటుడు జయరాం ఇంటికి పూజ కోసం ఆ విగ్రహాలను అప్పట్లో తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019 జూలై 19న తొలగించిన విగ్రహాల బరువు 42.8 కిలో గ్రాములుగా ఉంటే…. ఆ తర్వాత లెక్క వేస్తే వాటి బరువు 38.25 కిలోలకు పడిపోయింది. మొత్తంగా 4.54 కిలోల బంగారం మాయమైంది. వాస్తవానికి ఆ విగ్రహాలను నేరుగా వర్క్ షాప్ కు తీసుకెళ్లి.. తిరిగి తీసుకురాలేదు. దానికి బదులుగా ఆ కళాఖండాలను వివిధ ప్రదేశాలకు తరలించారు. కొట్టాయం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆలయానికి, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులోని శ్రీరామపురం అయ్యప్ప మందిరానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మలయాళ నటుడు జయరాం ఇంట్లో ప్రైవేట్ పూజ కోసం ఆ విగ్రహాలను తీసుకెళ్లి.. మళ్లీ సెప్టెంబర్ 11, 2019 న శబరిమల తీసుకెళ్లారు. “ద్వారపాలకుల విగ్రహాలు లోపలి గర్భగుడి తలుపుల పక్కన ఉన్నాయి. కవచాలను చెన్నైలోని జయరాం ఇంట్లో నిర్వహించిన పూజలో ఉంచారు. ఆ తర్వాత వాటిని శబరిమలకు తరలించారు. అనంతరం అయ్యప్ప దివ్య కీర్తనలతో పూజలు, ఆచారాల మధ్య ప్రతిష్టించారని” స్మార్ట్ క్రియేషన్స్ (ఆ విగ్రహాల బంగారాన్ని కొలచిన చెన్నై సంస్థ) ఫేస్ బుక్ పేజీలో పేర్కొంది.
ఈ ఆలయానికి ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మొట్టమొదటిసారిగా 1998లో భారీగా (30 కిలోలు) బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఒక ఏడాది తర్వాత ఆలయంలోని తలుపులకు బంగారు పూతను పూశారు. దీనికోసం 800 గ్రాముల బంగారాన్ని వాడారు. 1998లో ఆలయానికి ఎంత మొత్తంలో బంగారం వచ్చిందనేది ఇప్పటికీ లెక్కలు సరిగా లేవని.. రికార్డులు కూడా సమగ్రంగా లేవని హైకోర్టు, విజిలెన్స్ విభాగాలు పదే పదే చెబుతున్నాయి. ఇప్పటికే అక్కడి ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. గతంలో ఉన్నికృష్ణన్ (శబరిమల ఆలయ పర్యవేక్షకుడు) నుంచి ఓ ఈ మెయిల్ ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. నాడు ఉన్నికృష్ణన్ పంపించిన ఒక ఈమెయిల్లో.. ఆలయంలో మిగిలిపోయిన బంగారాన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు కదా.. అని ఆయన అందులో కోరారు. కేరళ హైకోర్టు బహిరంగ విచారణలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. “స్పాన్సర్ కు ప్యానెల్ బోర్డును అప్పగించినప్పుడు నిబంధన పరిధిలో వ్యవహరించామని, ప్రాథమిక విజిలెన్స్ తనిఖీ చేపట్టామని శబరిమల ఆలయ బోర్డ్ చెబుతుండడం” విశేషం.
ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు వీడి సతీషన్(కాంగ్రెస్ పార్టీ) ” భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారాన్ని, విలువైన వస్తువులను కొందరు దోచుకున్నారు. దోచుకున్న వారిని శబరిమల ఆలయ బోర్డు కాపాడుతోందని” విమర్శించారు.. మరోవైపు ఈ వ్యవహారం అధికార పార్టీలో చిచ్చు పెడుతోంది. సిపిఎం లో అంతర్గత కొమ్ములాటలకు దారి తీస్తోంది. శబరిమల ఆలయ బోర్డు మాజీ అధ్యక్షుడు ఆనంద గోపన్, పద్మ కుమార్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. 2017 -19 మధ్య బోర్డు అధ్యక్షుడిగా ఉన్న పద్మ కుమార్.. కొత్త అంశాలను లేవనెత్తారు. ” శబరిమలలో ప్రతీది నిబంధనల ప్రకారం జరుగుతుందా.. శబరిమలకు అధ్యక్షులుగా పనిచేసినవారు విదేశీ పర్యటనలు చేపట్టినప్పుడు ఎవరు ఆ ఖర్చులు భరించారు.. వాటిపై విచారణ జరపాలని” డిమాండ్ చేశారు..” నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆలయంలో ఉన్న బంగారు పలకలను బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించలేదు. నాడు అయ్యప్ప స్వామి వారి ఆలయంలో సురక్షితంగా ఉన్నాడు. ఒకవేళ ఇప్పటి పార్టీ గనుక అధికారంలో ఉండి ఉంటే ఆయన విగ్రహం కూడా మాయమయ్యేదని” దేవస్యం మాజీమంత్రి సుధాకరన్ చేసిన విమర్శలు సంచలనం కలిగిస్తున్నాయి.