గురుకులాల కార్యదర్శిగా ఉన్న సమయంలోనే ఓ విద్యార్థినిని ఎవరెస్టు శిఖరం ఎక్కించారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. మరి, ఇప్పుడు ఈయనే స్వయంగా అధికార శిఖరం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రతిష్టాత్మక ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి వచ్చారు. ఎవరెస్టును ఎక్కడం సాధనతో సాధ్యమవుతుంది. కానీ.. రాజకీయం అలా కాదు. ఎన్నో లెక్కలు తేలాల్సి ఉంటుంది. తేల్చుకోవాల్సి ఉంటుంది. మరి, ఇలాంటి లక్ష్యాన్ని సాధిస్తారా? సాధించడానికి ఆయనముందున్న సవాళ్లేంటీ అన్నది చూద్దాం.
ఉద్యోగంలో ఉండి కొంత మందికి మాత్రమే సేవ చేయగలిగానని చెప్పిన ప్రవీణ్ కుమార్.. అందరికీ సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఇవాళ ఆయన బహుజన్ సమాజ్ పార్టీలో చేరుతున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో ఈ మేరకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభను విజయవంతం చేయాలని గడిచిన పక్షం రోజులుగా స్వేరోస్ సభ్యులు, బీఎస్పీ కార్యకర్తలు జిల్లాలోని పలు చోట్ల పర్యటించారు. దాదాపు లక్షన్నర మందిని తరలించేందుకు ప్లాన్ చేశారు. అయితే.. సభకు జనాన్ని ఏదో విధంగా సమీకరించొచ్చు. కానీ.. రాష్ట్రంలోని దళితులను ఆయన ఏ మేరకు ఏకం చేయగలరన్నది ప్రధాన సందేహం.
ఉద్యోగానికి రాజీనామా చేసింది మొదలు వడివడిగా రాజకీయాల వైపు అడుగులు వేసిన ప్రవీణ్ కుమార్.. నేరుగా ముఖ్యమంత్రి పై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు. దళిత బంధు వంటి పథకాన్ని కూడా ఉపయోగం లేనిదిగా కొట్టిపారేశారు. ఇది శాశ్వత పరిష్కారం కాదని చెప్పారు. సంపద మొత్తం ఒక శాతం మంది వద్ద పోగుపడిందని, దాన్ని మొత్తం జనానికి సమానంగా పంచాలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు. అయితే.. తన లక్ష్యాన్ని సాధించడం అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దళితులంతా ఏదో ఒక పార్టీలో కలిసిపోయి ఉన్నారు. అలాంటి వారిని సమీకరించడానికి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నారు. ఈ పార్టీ తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్నదే. మరి, ఇప్పుడు ప్రవీణ్ అందులో చేరి, తన వెంట రావాలని పిలిస్తే.. ఆయన వెంట నడిచేందుకు ఎంత మంది దళితులు సిద్ధంగా ఉన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీఎస్పీకి చెప్పుకోదగిన స్థాయిలోనూ కేడర్ లేదు. అలాంటి పార్టీలో చేరిన ప్రవీణ్ కుమార్.. దళిత, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిస్తానని శపథం చేస్తున్నారు. తెలంగాణలో అంతటి రాజకీయ శూన్యత ఉన్నదా? అన్నది ప్రశ్న. మొన్నటికి మొన్న షర్మిల ఘనంగా పార్టీని ప్రకటించారు. కానీ.. ఇప్పుడు ఆమెకు ఏ కార్యక్రమం తీసుకొని జనాల్లోకి వెళ్లాలన్నదే అర్థం కాకుండా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను రాజకీయ అరంగేట్రం చేసే సభకు వచ్చే వారంతా సొంత ఖర్చులతో రావాలని కోరారు ప్రవీణ్ కుమార్. అలంటిది.. రాజకీయాలు కాస్ట్ లీ అయిపోయిన ఈ రోజుల్లో.. ఆయన ఏ విధంగా పార్టీని నడుపుతారు? రాజ్యాధికారం అనే అంతిమ లక్ష్యం వరకు ఎలా తీసుకెళ్తారన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.