తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్లగొండలో జరిగిన బహిరంగసభలో బీఎస్పీలో చేరారు. ప్రస్తుతం బీఎస్పీ రాష్ర్ట కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయాల్సిందిగా ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈనెల 26న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగే బీఎస్పీ బహిరంగ సభలో ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారో లేదో అనేది తెలుస్తుందని చెబుతున్నారు.
ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే రాజకీయ సమీకరణలు మారుతాయని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ప్రవీణ్ కుమార్ కు మంచి పేరుంది. దీంతో వారి ఓట్లన్నీ ఆయనకు పడతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పోటీపై అందరిలో ఆసక్తి నెలకొంది. హుజురాబాద్ లో సుమారు దళితుల ఓట్లు 50 వేల వరకు ఉండడంతో ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే బీజేపీ, టీఆర్ఎస్ కు ఓట్లు పడవనే పలువురు రాజీయ విశ్లేషకులు చెబుతున్నారు.
హుజురాబాద్ లో కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ గానే ప్రచారం సాగుతుండడంతో ఇక్కడ పోటీకి కాంగ్రెస్ కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ పోటీ చేస్తారని ప్రచారం సాగినా ఇంతవరకు ఆమె అభ్యర్థిత్వంపై ప్రకటించలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం హుజురాబాద్ పై దృష్టి సారించలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే సురేఖ పోటీకి షరతులు పెట్టినట్లు సమాచారం. ఏదిఏమైనా హుజురాబాద్ లో రాజకీయం ఎటు వైపు పోతుందో అర్థం కావడం లేదు.
నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ఆగస్టు 11న బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీ కులాల చర్చా వేదిక జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీల స్థితిగతులపై మాట్లాడారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం కావాలని ఆకాంక్షించారు. చరిత్ర తిరగరాయాలంటే బహుజన రాజ్యాన్ని స్థాపించాలని అభిప్రాయపడ్డారు. బహుజన రాజ్యంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.