సంపద మొత్తం ఒక్క శాతం మంది వద్దనే పేరుకుపోయింది. దాన్ని సమానంగా పంచడమే తన లక్ష్యం అంటూ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. గురుకులాల కార్యదర్శిగా తనదైన ముద్రవేసిన ఆయన.. ఉన్నట్టుండి తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్నారు. తన ఉద్యోగంలో ఉండి కొంత మందికి మాత్రమే సేవ చేయగలిగానని చెప్పిన ప్రవీణ్ కుమార్.. అందరికీ సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించిన ఆయన.. ఇవాళ నిర్వహిస్తున్న బహిరంగ సభ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు.
నల్గొండ జిల్లాలోని నాగార్జున డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో ఈ మేరకు సభ ఏర్పాటు చేశారు. ఈ సభను విజయవంతం చేయాలని గడిచిన పక్షం రోజులుగా స్వేరోస్ సభ్యులు, బీఎస్పీ కార్యకర్తలు జిల్లాలోని పలు చోట్ల పర్యటించారు. దాదాపు లక్షన్నర మందిని తరలించేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. వీరి ఆధ్వర్యంలో సభకు జనాన్ని తరలించే ప్రయత్నాలు సాగించారు.
గ్రామాల్లోకి వెళ్లిన వీరంతా.. బహుజన వాదం గురించి వివరించే ప్రయత్నం చేశారు. మన జీవితాల బాగు కోసమే ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆయనకు మద్దతు నిలవాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో.. సొంతంగా ఎవరికి వారు వాహనాలు ఏర్పాటు చేసుకొని, భోజన ఖర్చులు కూడా ఎవరికి వారే పెట్టుకునేలా సిద్ధమై సభకు రావాలని కోరారు.
దీంతో.. ప్రవీణ్ కుమార్ సభకు ఎంత మంది వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇవాళ రాజకీయ సభలు, సమావేశాలు ఎలా కొనసాగుతున్నాయో అందరికీ తెలిసిందే. వచ్చిన వాళ్లకు ప్రయాణ ఛార్జీలు, భోజనాలతోపాటు పని వదిలి వచ్చినందుకు కూలీ కూడా చెల్లిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎవరి ఖర్చులు వారివే అని చెప్పడంతో.. ఎంత మంది వస్తారన్నది ఉత్కంఠగా మారింది.
రాజీనామా చేసింది మొదలు వడివడిగా రాజకీయాల వైపు అడుగులు వేసిన ప్రవీణ్ కుమార్.. నేరుగా ముఖ్యమంత్రి పై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు. దళిత బంధు వంటి పథకాన్ని కూడా ఉపయోగం లేనిదిగా కొట్టిపారేశారు. ఇది శాశ్వత పరిష్కారం కాదని చెప్పారు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏమేరకు విజయవంతం అవుతుందన్నది చూడాలి.