Siddham Sabha: సిద్ధం సభలకు భారీగా జనాలు వస్తున్నారని వైసీపీ చెప్పుకొస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు సిద్ధం సభలు జరిగాయి. లక్షలాదిమంది జనాలు వచ్చారని వైసిపి ఆర్పాటం చేస్తోంది. అయితే ఇదంతా గ్రాఫిక్ మాయాజాలంతోనే చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేల మంది సామర్థ్యం కలిగిన ప్రాంగణాల్లో లక్షలాది మంది ఎలా అని ప్రశ్నిస్తున్నాయి. అధికార దుర్వినియోగంతో జనాలను సమీకరిస్తే తప్పకుండా వస్తారని.. అందులో విశేషం ఏమిటని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.నిన్నటి మేదరమెట్ల సిద్ధం సభకు ఆరు జిల్లాల నుంచి 3,500 బస్సులను తరలించినట్లు తెలుస్తోంది. వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు ఇలా యంత్రాంగాన్ని అంతటినీ మోహరించి జనాలను తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి సైతం జన సమీకరణ చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సిద్ధం ఆఖరి సభలో జన సమీకరణకు వైసిపి వాలంటీర్లను వాడుకుంది. వారి సేవలను దుర్వినియోగపరిచింది. చాలాచోట్ల వాలంటీర్లు వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రావాలని ఇంటికి రూ.500 ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. సంక్షేమ పథకాలు నిలిపివేస్తారన్న భయంతో చాలామంది హాజరయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలను వలంటీర్లు దగ్గరుండి సభకుతరలించడం అన్ని జిల్లాల్లో కనిపించింది. బస్సులో భోజనం ప్యాకెట్, మద్యం సీసాలను సైతం అందించారు. సభా ప్రాంగణం పక్కనే చాలామంది మద్యం సేవించి చిందులేయడం కనిపించింది. అటు మందు ఎక్కువై పడిపోయిన వారు ఉన్నారు. మందుబాబుల చేష్టలతో మహిళలు ఇబ్బంది పడ్డారు. కొందరైతే జేబు దొంగల బారిన పడ్డారు. సెల్ ఫోన్లు, పర్సులు పోగొట్టుకున్నారు.
అయితే ఈ సిద్ధం సభకు విద్యార్థులను తరలించడం విశేషం. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలపై ఒత్తిడి పెంచి విద్యార్థులను తరలించకపోయినట్లు తెలుస్తోంది. భోజనం పెట్టడంతో పాటు ఒక్కొక్కరికి రూ.250 పాకెట్ మనీ ఇస్తామని ఆశ చూపి తరలించారు. వైసీపీ విద్యార్థి విభాగం సంఘ నాయకుడు ఒకరు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఒక్కో బస్సులో 40 నుంచి 50 మంది విద్యార్థులను గుంటూరు నుంచి తరలించారు. మొత్తం 50 బస్సుల్లో రెండు వేల మందిని తరలించినట్లు తెలుస్తోంది. ఇలా సిద్ధం సభల కోసం వైసిపి యదేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది.ముఖ్యంగా వాలంటీర్లు అధికార పార్టీ కార్యక్రమ నిర్వహణలో దాసోహం అయ్యారు. అటు యంత్రాంగం సైతం సహకరించడంతో సిద్ధం సభకు లక్షలాది మంది జనాలు వచ్చినట్లు వైసిపి ఆర్భాటం చేస్తోంది.