
ఏటీఎం క్యాష్ లోడింగ్ వాహనం నుంచి రూ.39 లక్షల నగదు చోరీ చేసిన సంఘటన రాష్ట్ర రాజధాని ప్రాంతంలో సంచలనం సృష్టించింది. రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో రైటర్ సేఫ్ ఏజన్సీ సిబ్బంది ఏటీఎంలలో క్యాష్ లోడింగ్ చేసేందుకు వివిధ బ్యాంకుల నుంచి రూ.39 లక్షలు నగదును సేకరించి వాహనంలో ఉంచి మరో బ్యాంక్ లో నగదు సేకరించే క్రమంలో దొంగతనం చోటు చేసుకుంది. నగరంలోని ఉన్న సెంట్రల్ బ్యాంక్ లో నగదు తీసుకునేందుకు క్యాష్ లోడింగ్ వాహనాన్ని బ్యాంక్ కు సమీపంలో ఆపారు. ఇద్దరు సిబ్బంది బ్యాంక్ లోకి వెళ్లగా సెక్యూరిటీ ఏటీఎం వద్దకు, ఇంకొకరు టీ స్టాల్ వద్దకు వెళ్లారు. వాహనం వద్ద ఎవరు లేరు. బ్యాంక్ లోకి వెళ్లిన సిబ్బంది నగదు తీసుకుని వాహనం వద్దకు వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండటం, బ్యాంక్ ల నుంచి సేకరించిన రూ. 39 లక్షలు వాహనంలో లేకపోవడంతో సిబ్బంది కేకలు పెట్టారు. క్యాష్ లోడింగ్ వాహనం కావడంతో నగదు నిల్వ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు వాహనంలో ఉన్నాయి.
సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సంఘటనా స్థలంలో ఎన్నో చిక్కు ప్రశ్నలు వేధించాయి. వాహనాన్ని సీసీ కెమెరాకు చిక్కకుండా నిలపడం, నెంబర్ లాక్ ఉన్న క్యాష్ లాకర్ డోర్ పగల గొట్టకుండా తెరుచు కోవడం, వాహనం దగ్గర ఒక్కరూ లేకుండా అందరూ వెళ్లి పోవడం, తాళాలు, డోర్ పగల గొట్టినట్లు తాము చూడలేదని బ్యాంక్ సమీపంలోని షాపుల యజమానులు చెప్పడం వంటి చిక్కు ప్రశ్నలతో పాటు సిబ్బంది పొంతన లేని సమాధానాలతో పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో రైటర్ సేఫ్ ఏజెన్సీ సిబ్బంది తిరుమలరావు, భుజంగరావు, వెంకట నాగేంద్ర, ప్రవీణ్ కుమార్ లను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ దొంగతనం ఇంటిదొంగల పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.