కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోగుల్లో ఆందోళన రేపుతోంది. కరోనా బాధితులకు సరైన వైద్యం అందక పడే తిప్పలు వర్ణణాతీతం. ఇటీవల శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ, ఆయన తల్లికి పాజిటివ్ రావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. అయితే అక్కడ పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నాడు. చికిత్స మాట అటుంచితే సదుపాయాలు సైతం సక్రమంగా లేవని సోషల్ మీడియాలో తన అక్కసు వెళ్లగక్కాడు. దీంతో వీడియో వైరల్ అయి ప్రభంజనం సృష్టిస్తోంది. ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. తనలాంటి ప్రభుత్వ అధికారికే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
పాచిపోయిన భోజనం
రోగులకు కనీసం సమయానికి భోజనం కూడా పెట్టడం లేదని చెప్పాడు. తన తల్లి వృద్ధురాలైనా పట్టించుకోోకుండా రాత్రి 12 గంటలకు పాచిపోయిన భోజనం పెట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే కరోనాతో కాకుండా ఆసుపత్రి తీరుకే ప్రాణాలు పోయేలాగా ఉన్నాయని వీడియోలా భోరున విలపించాడు. ఏపీ ప్రభుత్వ తీరుకు సిగ్గుపడుతున్నానని వాపోయాడు. పరిస్థితి ఇలాగే ఉంటే కోవిడ్ బాధితులు ఖచ్చితంగా తమ ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఏర్పడిందని కన్నీరుమున్నీరయ్యాడు.
కనీస సదుపాయాలు కరువు
ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. దీంతో రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. సరైన పడకలు లేక ఆక్సిజన్ సౌకర్యం లేకపోవడంతో చాలా మంది రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా వస్తే ఖతమే అనే నిర్ణయానికి వస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రభావానికి సామాన్యుడైనా, ధనవంతుడైనా అంతే సంగతని తేల్చేస్తున్నారు.
నిరోధానికి చర్యలేవి?
కరోనా మహమ్మారి నిరోధానికి చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం వేగం పుంజుకోవడం లేదు. దీంతో కరోనా మహమ్మారి బారిన పడి పలువురు మరణిస్తున్నా పట్టించుకునే పాపాన పోవడం లేదు. సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు పదేపదే విమర్శిస్తున్నా వారికి చెవికి ఎక్కడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికైనా కరోనా నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపట్టి బాధితులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పదేపదే చెబుతున్నారు.