MLA Roja: ఈ నడుమ ఏపీలో బాగా హాట్ టాపిక్ అవుతున్న వాటిల్లో రోడ్ల పరిస్థితి కూడా ఒకటి. ఏపీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని ప్రతిపక్షాలు నిత్యం విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే ఇన్ని రోజులు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతోనే జగన్ ప్రభుత్వం ఇబ్బందులు పడితే.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ అయిన రోజా సెల్వమని చేసిన పని ఇక్కట్లు తెస్తోందనే చెప్పాలి. ఆమె సొంత నియోజకవర్గం నగరిలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి.

దీంతో తన నియోజకవర్గంలోని చాలా సమస్యలను పరిష్కరించాలంటూ గురువారం ఆమె మంత్రులు బొత్స సత్యనారాయణ, తన జిల్లా ఇన్ చార్జి మంత్రి అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయిన సందర్భంగా.. రోజా తన నియోజకవర్గంలోని సమస్యలపై విన్నవించారు. అక్కడే ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణబాబుకు కూడా వినతిపత్రం ఇచ్చారు. ఇంతకు ముందు నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా అధికారులు చేసిన పనులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు.
Also Read: పవన్ తో చంద్రబాబు కలిస్తే.. మరి బీజేపీ పరిస్థితేంటి?
రోడ్డు పొడవునా గుంతలు ఉన్నాయని, ప్రయాణం చేయాలంటేనే చాలా ఇబ్బందిగా ఉందంటూ వినతి పత్రంలో పేర్కొన్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవట్లేదు గానీ.. టోల్ చార్జీలు మాత్రం వసూలు చేస్తున్నారన్నారు రోజా. అయితే ఇప్పటికే రోడ్ల దుస్థితిపై అటు ప్రతిపక్షాలు అయిన జనసేన, బీజేపీ, టీడీపీ వరుసగా విమర్శలు సంధిస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలో కూడా దారుణంగా ట్రోల్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో రోజా చేసిన పని వాస్తవ పరిస్థితులను చూపిస్తోంది.
అంటే ప్రతిపక్షాలు చేసిన విమర్శలు నిజమే అని అధికార పార్టీ ఒప్పుకున్నట్టు అవుతోంది. కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం అవుతున్న ప్రభుత్వం.. రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి చేయట్లేదనే విమర్శలు ఇప్పటికే బాగా వినిపిస్తున్నాయి. ఎవరైనా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే.. తిప్పి కొట్టే వారిలో రోజా ముందుంటారు. కానీ ఇప్పుడు ఆమెనే ఇలా ఫిర్యాదులు చేయడం పార్టీని ఇబ్బందులో పడేస్తోంది. ఇకపై ఆమె రోడ్లపై ఎవరైనా విమర్శలు చేసినా.. స్పందించలేని పరిస్థితి వచ్చింది. మొత్తానికి రోజా చేసిన పని సర్కారును ప్రశ్నించేలా చేస్తోందన్నమాట.
Also Read: పార్టీలకు అనుకూలంగా పక్కదారి పడుతున్న మీడియా సిద్ధాంతాలు?