
దేశంలో కరోనాతో భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఇప్పుడు ప్రాణం కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతోంది. ఎన్ని కోట్లు ఉన్నా కూడా కరోనా కనికరించడం లేదు. గొప్ప గొప్ప వాళ్లే కరోనాకు కూలిపోతున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనలవి కావడం లేదు.
కరోనాతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. బెడ్స్ ఖాళీగా లేక రోగులతో అంబులెన్స్ లు క్యూ కడుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్నాయి. బెడ్స్ ఖాళీగా లేవు. వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. చివరకు శ్మశాన వాటికలు కూడా నిండిపోతున్నాయి. దేశంలో ఇప్పుడు కరోనా పరిస్థితి అత్యంత భయానకంగా మారుతోందని చెప్పొచ్చు. కొత్త కేసులు శరవేగంగా పెరుగుతూ అంతటా ఆందోళన హాహాకారాలకు కారణమవుతోంది.
*నిమిషానికి ముగ్గురి మరణం
భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 2,61,500 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన మనదేశంలో గంటకు సగటున 10896 కేసులు.. అంటే నిమిషానికి 181మంది కోవిడ్ బారినపడుతున్నారు. శనివారం దేశంలో 1501 మంది మరణించారు. గంటకు సగటున 62.54 మంది.. నిమిషానికి 1.04 మంది అంటే నిమిషానికొక్కరు చొప్పున చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
*బ్లాక్ చేస్తూ ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ
కరోనా కల్లోలంతో ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వాల నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా లక్షలు వసూలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అత్యంత కార్పొరేట్ ఆస్పత్రులు గల హైదరాబాద్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, ప్రజలంతా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వస్తుండడంతో ఇక్కడ బెడ్స్ ఖాళీగా లేవు. అన్నీ హౌస్ ఫుల్ . రికమండేషన్ పై బెడ్ దొరికినా ముందు 2.50 లక్షలు డిపాజిట్ చేస్తేనే ప్రైవేటు ఆస్పత్రులు బెడ్స్ ఇస్తున్నాయి. దీంతో కరోనా వైద్యం ఎంత ఖరీదో అర్థం చేసుకోవచ్చు.
*రెమెడిసివివ్, వ్యాక్సిన్, మందులు బ్లాక్
ఇక ఇంతటి విపత్కర కరోనా పరిస్థితుల్లో మానవత్వంతో వ్యవహరించి ఆస్పత్రులు, మందుల సంస్థల యాజమాన్యాలు ధరలు తగ్గించి రోగులకు ఇవ్వాలి. కానీ ఇదే అదునుగా భారీగా దోపిడీకి పాల్పడుతున్నారు. కరోనా వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ సహా వ్యాక్సిన్లు ఇతర మందులను బ్లాక్ చేసి మార్కెట్లో రూ.10 వేల నుంచి రూ.60వేల వరకు అమ్ముకుంటున్నారు. కరోనా రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రాణాల కోసం ఆస్తులు అమ్ముకొని ఆస్పత్రుల బిల్లులు కడుతున్న దౌర్భాగ్య స్థితి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. దళారీ వ్యవస్థ కరోనా మందులను బ్లాక్ చేసి మరొకరి అవసరాన్ని తమ అవకాశంగా చేసుకుని కోట్లు గడిస్తోంది.
*ప్రభుత్వాలు, నేతలు దోపిడీలా భాగమా?
దేశంలో ఇంతటి కరోనా కల్లోలంలో ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయకుండా.. కరోనా మందులను ఆస్పత్రుల్లో ఉంచితంగా పంచకుండా ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి ఆస్కారం ఇస్తున్న ప్రభుత్వాలే మొదటి విలన్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ నాయకులు వ్యభిచార పాత్ర పోషిస్తున్నారు అని బాధితులు ఆక్రోషిస్తున్నారు. పేదవాడికి ఈ దేశంలో భరోసా అంటూ లేదు అని అర్థమవుతోంది. చస్తే చావండి అని తెలుగు ప్రభుత్వాలు, కేంద్రం చేష్టలుడిగి చూస్తున్న వైనం వెలుగుచూసింది.
జనాల నిర్లక్ష్యంతో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. వాటిని కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్వయంగా కేంద్రమంత్రి వీకే సింగ్ తన సోదరుడికి ఒక బెడ్ ఇప్పించాలని యూపీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే, ఆస్పత్రి డీఎంను కోరారంటే మన దేశంలో వైద్యం ఎంత దుర్లభంగా అందుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పిన భారత నేల నేడు తిరుగుబాటు తత్వాన్ని కోల్పోయి నిశ్చల సమాధిలో, నిర్జీవంగా పడి ఉందని అర్థమవుతోంది. ఇది అందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన స్థితి. మన వ్యవస్థలన్నీ చేష్టలుడిగి చూస్తున్నాయి. ఈ దారుణ పరిస్థితులకు డబ్బులేని వారు పేదలు అసువులు బాయడం తప్పితే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి జారుకుంటున్నారు.ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కరోనా నివారణ చర్యలు చేపట్టకపోతే దేశం అల్లకల్లోలం కావడం ఖాయంగా కనిపిస్తోంది.