Flooding Rivers Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఇప్పటికే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండిపోవడంతో కురిసిన నీరంతా సముద్రంలో కలుస్తున్నాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో నీరు బయటకు వెళుతోంది. జూన్ లో కురిసిన వర్షాలకే జలకళ సంతరించుకోవడంతో ఇప్పుడు పడే వానలతో నీరంతా సముద్రంలోకి జారుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలతో చరిత్రలో ఎన్నడు లేనంత వర్షపాతం నమోదవుతోంది. అధిక వర్షాలు ప్రాంతాలను ముంపునకు గురిచేస్తున్నాయి. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి నదులు ఉప్పొంగుతున్నాయి. పోటెత్తి ప్రవహస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్ని నిండుకుండలుగా మారి గేట్ల ద్వారా నీరు వెళ్లిపోతోంది. వాగులు అన్ని సముద్రం వైపే పరుగులు పెడుతున్నాయి. రాష్ట్రంలో ప్రవహించే నదులు నిండుకుండల్లా మారాయి. దీంతో మిగిలిన నీరంతా ప్రవాహంగా మారుతోంది. ఐదు నదులు ఒకేసారి ఉప్పొంగి సముద్రంలో కలవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికి మన తెలుగు రాష్ట్రాలే వేదిక కావడం మనకు గర్వకారణం. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
అప్పపీడనం ప్రభావంతోనే రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరు కూడా సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. మత్స్యకార్మికులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. ఇంకా మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తే అవకాశం పొంచి ఉంది.

ప్రకృతి ప్రకోపంతోనే ఇలా జరుగుతోంది. కొన్ని దేశాల్లో వరదలు మరికొన్ని దేశాల్లో కరువు పరిస్థితులు చూస్తుంటే పర్యావరణం గతి తప్పినట్లు చెబుతున్నారు. దీని పర్యవసానంగానే ఇలా పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. పర్యావరణ వేత్తలు ఇదివరకే హెచ్చరిస్తున్నా ఎవరు లెక్కచేయడం లేదు. దీంతోనే ఇంకా ప్రకృతి విచ్చలవిడిగా రెచ్చిపోయే అవకాశం ఉంది. దీనిపై అందరు అప్రమత్తమవుతున్నా ఫలితాలు మాత్రం ప్రజలను భయపెట్టే విధంగా ఉంటున్నాయనడంలో సందేహం లేదు. ఇంకా ఎన్ని ఉత్పాతాలు చూడాల్సి వస్తోందోననే బెంగ అందరిలో వస్తోంది.