UK Crisis 2022- Rishi Sunak: బ్రిటన్ ప్రధాని కావడానికి రిషి సునక్ కు మరో అవకాశం వచ్చింది. అక్కడ ఏర్పడిన సంక్షోభంతో మరోసారి ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తాను బరిలో ఉంటానని రిషి సునక్ ప్రకటించాడు. ప్రధాని పదవి రేసులో ఉండడానికి ఇప్పటికే కనీస నామినేషన్ పరిమితిని దాటాడు. 100 మంది ఎంపీల మద్దతు తనకు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రిషి సునక్ కు పోటీగా బోరిస్ జాన్సన్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన కరేబియన్లో రిలాక్స్ అవుతున్నారు. చట్ట సభ సభ్యుల మద్దతు పొందేందుకు అక్కడి నుంచి హూటాహుటిన బయలు దేరాడు.

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో ఆమె రాజీనామా చేశారు. ఆమె రాజీనామా తరువాత వెంటనే ఈ పదవిని క్లెయిమ్ చేసుకునేందుకు రిషి సునక్ సిద్ధమయ్యాడు. అయితే ప్రధాని పదవికి అవసరమైన 100 మంది ఎంపీల మద్దతును ఇప్పటికే సాధించినట్లు తెలుపుతున్నారు. కానీ దీనిపై సునక్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ చివరి వరకు ఆయనకు మద్దతు కచ్చితంగా ఉంటుందని విశ్వసిస్తున్నారు.
కొన్ని విమర్శల నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకున్న బోరిస్ జాన్సన్ ఇప్పుడు సునక్ కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తనకు 46 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రచారం చేస్తున్నారు. సోమవారానికి ఈ సంఖ్య 100కు చేరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సునక్ కు 140 ఎంపీలు మద్దతు ఇస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బోరిస్, సునక్ లమధ్యే పోటీ ఉంటుందని తెలుస్తోంది. అయితే త్వరలో ఇద్దరు నేతల పోటీపై ప్రకటన చేసే అవకాశం ఉంటుంది.

గత రేసులో చివరి వరకు వచ్చిన సునక్ కు ఆ తరువాత మద్దతు తగ్గింది. ఈసారి మాత్రం కచ్చితంగా ప్రధాని అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. బోరిస్ పై గతంలో అనేక విమర్శలు వచ్చాయి. ఆర్థిక సంక్షోభానికి కారణం అతనే అని కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇటు సునక్ అనుకున్నట్లు సభ్యుల మద్దతు వస్తే భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రధాని అవుతారు.