Telangana Assembly Election: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించింది. వారికి బీ ఫారాలు కూడా అందజేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ లు కూడా మొదటి దశలో అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికలన్నాక ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటారు? అనే ప్రశ్నలు సర్వసాధారణంగా మదిలో మెదులుతుంటాయి. ఇటువంటి వారి కోసమే కొన్ని కొన్ని సంస్థలు సర్వేలు చేస్తుంటాయి. పార్టీలు కూడా సొంతంగా కొన్ని కొన్ని ఏజెన్సీ లతో సర్వేలు నిర్వహించుకుంటాయి. వారు ఇచ్చిన నివేదికల ఆధారంగా అవి తదుపరి అడుగులు వేస్తుంటాయి.
తెలంగాణలో ఇప్పటికే రెండు సంస్థలు తమ సర్వే వివరాలను ప్రకటించాయి. సీ ఓటర్ సర్వే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించింది. మిషన్ చాణక్య భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని వివరించింది. ఈ సర్వే సంస్థల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో కారు కంటే చేయికి కొంత మేర ఎడ్జ్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు సైతం తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ మరి విడత బస్సు యాత్రను కూడా ఇక్కడ చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. తాజాగా రైజ్ అనే సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించింది.
ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం భారత రాష్ట్ర సమితి 47 నుంచి 56 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 63 స్థానాలు, ఎంఐఎం 5 నుంచి 8 స్థానాలు, భారతీయ జనతా పార్టీ మూడు నుంచి ఐదు స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. గ్రౌండ్ రియాల్టీలో ఏ సామాజిక వర్గం ఎటువైపు ఉంది? ప్రభుత్వ పథకాలు పొందిన వారు ఏ పార్టీకి అండగా ఉన్నారు? న్యూట్రల్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? అనే విషయాలను ఆ సర్వే సంస్థ స్పష్టంగా ప్రకటించలేదు. అలాంటప్పుడు గ్రౌండ్ రియాల్టీని ఈ సంస్థ లెక్కలోకి తీసుకోలేదా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. వాస్తవానికి ఒక సర్వే సంస్థ గ్రౌండ్ రియాల్టీని లెక్కలోకి తీసుకుంటేనే అసలు విషయం బోధపడుతుంది. మరోవైపు ఈ సంస్థ చెప్పిన లెక్కలు కూడా సత్య దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. 56 స్థానాలు భారత రాష్ట్ర సమితికి వస్తే.. దాని మిత్రపక్షంతో కలిసి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు ఒకవేళ గెలుచుకుంటే.. అలాంటప్పుడు అది కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎటొచ్చి ఈ సర్వేలో భారతీయ జనతా పార్టీకే భంగపాటు మిగిలింది. ఈ సర్వే ఫలితాలు చూసిన ఆ పార్టీ పెద్దలు మారుతారేమో చూడాలి.