Ramgopal Varma : అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి బలం తగ్గిందన్న కామెంట్స్ వినిపించాయి. వైసిపి నుంచి భారీగా టిడిపిలోకి చేరికలు, గత ఏడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన గుబులు రేపాయి. అందుకే అక్కడ సిద్ధం సభను వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జన సమీకరణ చేయడంలో సక్సెస్ అయ్యాయి.
సిద్ధం పేరిట జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత భీమిలి నియోజకవర్గం లో సభ ఏర్పాటు చేశారు. రెండోది గోదావరి జిల్లాల్లో పూర్తయింది. రాప్తాడు లో మూడో సభ నిర్వహించారు. ఈ సభ ద్వారా టిడిపికి గట్టి సమాధానం ఇవ్వాలని భావించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి భారీగా జనాలను సమీకరించారు. ఇందుకుగాను మూడు వేల ఆర్టీసీ బస్సులను వినియోగించినట్లు తెలుస్తోంది. దాదాపు 500 కిలోమీటర్ల దూరం నుంచి సైతం జనాలను తరలించినట్లు సమాచారం. సభ సక్సెస్ కావడంతో వైసిపి శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
దాదాపు 280 ఎకరాలస్థలంలో సభ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అది కూడా చాలక జనాలు బయట నిరీక్షించినట్లు వైసిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. దాదాపు పది లక్షల మంది సభకు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధం సభకు సంబంధించిన యూట్యూబ్ లింకును తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కరువు ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమలో ఒక్కసారిగా ఓ మహా సముద్రం ఉద్భవించినట్టయిందని వ్యాఖ్యానించారు. 10 లక్షల మందికి పైగా హాజరైన ఓ జనసముద్రంగా అభివర్ణించారు. ఓ రాజకీయ సభకు ఎప్పుడూ లేనివిధంగా లక్షల మంది హాజరు కావడం దేశ చరిత్రలోనే తొలిసారి అని కామెంట్ చేశారు. జగన్ తర్వాతే ప్రధాని మోదీ ఈ స్థాయిలో ప్రజలను ఆకర్షించగలరని ఆర్జీవి పేర్కొనడం విశేషం.