జాతీయ స్థాయిలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలోనూ రోజురోజుకూ మసకబారుతోంది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. ముందు మరో పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. అదే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ నేతను కూడా ఈ ఎన్నికలతో ఖరారు చేసుకోవాలని అధిష్టానం నిర్ణయించుకుంది.
Also Read: పవన్ సంచలనం: గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ!
ఇందులో భాగంగానే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని గ్రేటర్ ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్రమైన నైరశ్యం ఏర్పడింది. పలుచోట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మలు కూడా దహనం చేశారు. దుబ్బాకలో గౌరవనీయమైన ఓటమి కూడా కాకపోవడంతో ఇప్పుడైనా సరైన నేత చేతుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పెట్టకపోతే ఇక పార్టీ గురించి మర్చిపోవాల్సి వస్తుందని కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్.
ఇంత జరిగినా కూడా కాంగ్రెస్‌లో మాత్రం వర్గపోరు తగ్గడం లేదు. దుబ్బాక ఫలితాల తర్వాత ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్–వీహెచ్ మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో ఏం జరిగినా ఈ కాంగ్రెస్ నేతల్లో మార్పు కోరడం వృథా ప్రయాసేనని వినిపిస్తోంది. అయితే.. ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన మాణిగం ఠాగూర్ మాత్రం పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఆయన రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ.. సీనియర్లందరినీ ఏకతాటిపైకి తెచ్చి రెవంత్‌కు బాధ్యతలు అప్పజెప్పడం అంత ఈజీ కాదనేది వాదన. గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి నుంచి రేవంత్ ఎంపీగా గెలిచారు. ఇప్పటికే తన నియోజకవర్గం పరిధిలో ఉన్న కార్పొరేటర్ సీట్లపై ప్రత్యేకంగా కసరత్తు కూడా చేస్తున్నారు.
Also Read: కేసీఆర్ ఇమేజీని కాపాడేందుకే ఆ న్యూస్ చానల్ తాపత్రయం!
అందుకే.. ఒక్క మల్కాజిగిరినే కాకుండా గ్రేటర్ మొత్తాన్ని రేవంత్‌కే బాధ్యత అప్పగించాలని ఠాగూర్ భావిస్తున్నారట. దీంతో రేవంత్‌కు కూడా ఈ గ్రేటర్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. రేవంత్‌కు ఇన్‌చార్జి ఇస్తే.. తన రాజకీయ భవిష్యత్ కోసమైనా ఆయన సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. మరి ఈ విషయంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ నాన్చుతుందో.. రేవంత్ వైపు మొగ్గుచూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్