టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రిగా ఈటల రాజేందర్ ను తొలగించిన తర్వాత నెక్ట్స్ పదవి కోల్పోయే మంత్రి జగదీశ్ రెడ్డి అంటూ ఆయన చేసిన ట్వీట్ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు. ‘ఓ పత్రిక కథనాన్ని షేర్ చేస్తూ మంత్రి జగదీష్ రెడ్డిపై రేవంత్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్.. కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం.. యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టేనా? అంటూ సెటైర్లతో వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
ఈ ట్వీట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతికిరణ్, మంత్రి జగదీష్ రెడ్డిలను ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడని నెటిజన్లు కౌంటర్లు ఇచ్చారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వీరంతా తొలగించబడుతారన్నది రేవంత్ రెడ్డి ట్వీట్ గా అర్థమవుతోందన్నారు.
రేవంత్ రెడ్డి ట్వీట్ పై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ‘చెత్త మనుషులకు.. చెత్త ఆలోచనలే ఉంటాయన్నారు. అలాంటి విషయాలపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ’ అని తెలిపారు.
ఇక ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డి కొడుకు పుట్టిన రోజు వేడుక కర్ణాటకలోని హంపీలో చేశారని.. దీనికి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొంత మంది పార్టీ ప్రముఖులు హాజరయ్యారని.. అది పుట్టిన రోజు వేడుక కాదని.. ఈటల గురించి చర్చించారని కథనంలో రాశారు. దీన్నే రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు. వీళ్లంతా కూడా బీజేపీలో చేరేందుకు చూస్తున్నారని ట్వీట్ లో సెటైర్లు వేశారు.