Revanth Reddy: టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ‘హుజూరాబాద్’. దాని కోసం రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించాలి.? ఎంత పోరాడాలి. కానీ నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా అసలు హుజూరాబాద్ లో ప్రచారమే చేయలేదు.
పైగా కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లాంటి హేమాహేమీలను కాదని.. విద్యార్థి నేత బల్మూరి వెంకట్ ను నిలబెట్టినప్పుడే సగం కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఇక రేవంత్ రెడ్డి ప్రచారం మొదలై నెల గడుస్తున్నా హుజూరాబాద్ లో కాలు మోపకపోవడంతో ఆయన ఈటల రాజేందర్ గెలుపు కోసం వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఈ క్రమంలోనే ఇక్కడున్న బలమైన కాంగ్రెస్ క్యాడర్ సైతం ఇప్పుడు ఈటల రాజేందర్ కు మద్దతుగా నిలుస్తోందట.. ఎన్నికల తర్వాత ఈటల , గడ్డం వివేక్, విశ్వేశ్వరరెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాక ఆలస్యం కూడా దానికి బలాన్ని చేకూరుస్తోంది.
ఈ క్రమంలోనే అన్ని వైపులా విమర్శలు రావడంతో రేవంత్ రెడ్డి కదిలారు. శుక్రవారం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కోసం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘ఇంటికో ఓటు’ అంటూ రేవంత్ ప్రచారం మొదలుపెట్టారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్క ఓటు కాంగ్రెస్ కు వేయాలని ప్రచారం ప్రారంభించారు. దీన్ని బట్టి గెలుపు కోసం కాదు.. కేవలం టీఆర్ఎస్ ను ఓడించేందుకే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని క్లియర్ కట్ గా అర్థమవుతోంది.