టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో తొలి ప్రసంగంలోనే రేవంత్ రెడ్డి తన టార్గెట్ కేసీఆర్ కుటుంబం అని స్పష్టం చేశారు. వారిపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు.దేవళ్లు, సోనియమ్మ దయతో తనకు ఈ పదవి వచ్చింది… 4 కోట్ల మంది ఆకాంక్షల మేరకు పనిచేయడానికే సోనియాగాంధీ నాకు ఈ బాధ్యత అప్పగించారని రేవంత్ రెడ్డి తెలిపారు.
నలుగురి చేతిలో 4 కోట్ల మంది బందీలయ్యారని రేవంత్ రెడ్డి పరోక్షంగా కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వయంపాలన లేక పెద్ద దిక్కు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ద్రోహులు గద్దెనెక్కి ఇష్టారీతిన ఆడుతున్నారని రేవంత్ ఆరోపించారు. అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలను టీఆర్ఎస్ ఆదుకోలేదని ఆరోపించారు. గులాబీ చీడను పొలిమేరలు దాటేవరకు తరమాలని.. అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.
ఏపీలో కాంగ్రెస్ చనిపోయినా ఫర్వాలేదని తెలంగాణ ఇస్తే.. సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపాల్సిన అవసరం లేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.మన తెలంగాణ తల్లి సోనియమ్మ అని.. నాలుగు కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లలో సోనియమ్మ గుడి కట్టుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇక జై రేవంత్ రెడ్డి నినాదాలు చేసిన కార్యకర్తలు, నాయకులను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వ్యక్తిగత నినాదాలు వద్దని .. అలా చేస్తే ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.కేవలం సోనియా, రాహుల్ గాంధీల నినాదం మినహా మరో వ్యక్తి నినాదం చేస్తే క్షమించనని పేర్కొనడం గమనార్హం. సమష్టిగా పోరాడుదామని రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత నినాదాలతో పార్టీకి తీరని నష్టమని వివరించారు.