
కాంగ్రెస్ అంటేనే అదొక మహాసముద్రం. అందులోకి చేపలు లాంటి నేతలు చేరాలి తప్పితే దాన్ని ఎవరూ కదపలేరు. అయితే ఎంతో మంది ఉద్దాండ పిండాలున్న కాంగ్రెస్ లో అంత త్వరగా అధికార అందలం దక్కదు. కానీ దీన్ని బ్రేక్ చేశాడు రేవంత్ రెడ్డి(Revanth Reddy). అవుతున్న రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఎదిగి కాంగ్రెస్(Congress)లో చేరిన మూడేళ్లలోనే ఏకంగా టీపీసీసీ చీఫ్ అయ్యాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించినా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి బలమైన ప్రత్యర్థి ఢీకొట్టినా కూడా అందరినీ మెప్పించి ఒప్పించి పీఠం అధిరోహించాడు..
ఎంతో మంది హేమాహేమీల్లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలతో కానిది జూనియర్ .. పైగా టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఎలా సాధ్యమైందన్న ప్రశ్న ఇప్పటికీ కాంగ్రెస్ శ్రేణులను తొలుస్తూనే ఉంటుంది. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, శశిధర్ రెడ్డి, వీహెచ్ సహా ఎంతో మంది సీనియర్లు ఉన్నా వారందరినీ పక్కనపెట్టి రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించడానికి అసలు కారణం ఏంటన్నది అంతుచిక్కలేదు.
అయితే తాజాగా తాను పీసీసీ కావడానికి ముఖ్య కారణాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ పీసీసీ పగ్గాలు దక్కడానికి నిజామాబద్ లో నిర్వహించిన ‘రాజీవ్ రైతు దీక్ష’ సక్సెస్ ముఖ్య కారణం అన్నారు. సోనియాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని తెలిపారు. నిజామాబాద్ లో సభ సక్సెస్ కావడం దేశవ్యాప్తంగా ఫోకస్ అయ్యానని.. అదే తనకు పీసీసీ చీఫ్ పదవిని తెచ్చిపెట్టిందని రేవంత్ తెలిపారు.
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి స్వయంగా రేవంత్ సభ నిర్వహణ, నాయకత్వ లక్షణాలను సోనియాంగాంధీకి చెప్పడంతో ఆమె పీసీసీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు దీక్షతో కేంద్రానికి సెగతగలడంతో రేవంత్ రెడ్డి కార్యదక్షత తెలిసి ఈ పదవి దక్కినట్టుగా తెలుస్తోంది.