
TS PCC Chief Revanth Reddy: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవరైనా పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో పెత్తనం చేసే లీడర్లు ఎక్కువగా ఉండడంతో పార్టీ కార్యక్రమాలు వెనుకంజలో పడిపోయాయి. రెబల్స్ లా రెచ్చిపోయే వారిని అదుపులో పెట్టే పనిలో పడ్డారు. తక్షణమే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మాణిగం ఠాగూర్ నాలుగు రోజుల క్రతం హైదరాబాద్ లో పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కొందరు నేతలు రేవంత్ రెడ్డి తీరుపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు.
రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు చేశారు. దళిత, గిరిజన దండోరా వేదికలు ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో గతంలో కూడా ఇలాగే చేయడంతో పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఫలితంగా పార్టీ ఎదుగుదల ఆగిపోయి అగాధంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇదే రీతిలో నిరంజన్, ఘంటా సత్యనారాయణ రెడ్డి వంటి నేతలు ప్రయత్నాలు చేయడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
దీనికి సరైన సమాధానాలు ఇవ్వకపోతే మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పడంతో వారిలో భయం పట్టుకుంది. ఇంకా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తీసకుంటామని హెచ్చరిస్తున్నారు. గాంధీభవన్ వేదికగా సీనియర్లమని చెప్పుకుంటూ పార్టీ కార్యక్రమాలకు అడ్డుపడితే సహించేది లేదని చెబుతున్నారు. ఎంతటి వారైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసేందుకు పాటు పడాలే తప్ప అడ్డుపడడం తగదని సూచిస్తున్నారు.
టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై పార్టీ కార్యక్రమాలపై వ్యతిరేకత తీసుకొస్తే బయటకు పంపేస్తామని సూచించారు. ఇలా వ్యవహరించే వారిపై రేవంత్ కు స్పష్టమైన సమాచారం ఉందని తెలుస్తోంది. అందుకే కోవర్టుల గురించి జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి దూకుడుగా ఉండడంతోనే నేతలంతా ఇలా ఆక్షేపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలంతా కోవర్టులుగా మారితే క్షమించమని చెప్పారు.