
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నిక ఎంతటి రచ్చకు దారి తీసింది అందరికీ తెలిసిందే. ఎన్నికలకు మూడు నెలల ముందే మొదలైన రచ్చ.. ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చింది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ రచ్చ రచ్చ చేశారు. దీంతో.. తెరవెనుక పెద్దలు జోక్యం చేసుకోవడం.. వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఈ సారి ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు సినీ పెద్దలు ప్రయత్నించారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే.. పోటీ దారులు మాత్రం ఎలక్షన్ కే సై అంటూ హింట్ ఇస్తూ వచ్చారు. ఇవాళ జరిగిన క్రమశిక్షణ సంఘం సమావేశంలో.. ఎన్నిక ఖాయమనే విషయం దాదాపుగా తేలిపోవడం గమనార్హం.
ఇవాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన వర్చువల్ గా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మా అసోసియేషన్ లోని కీలక సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ‘మా’లో నెలకొన్న సమస్యలు, ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధిపై చర్చించారు. అయితే.. ఈ సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా ఎన్నిక జరిపేందుకు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇప్పటికే.. ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించగా.. మంచు విష్ణు, హేమ, జీవిత, జీవీఎల్ వంటి వారు తాము అధ్యక్ష బరిలో ఉన్నామని అనౌన్స్ చేసుకున్నారు. అయితే.. వీరిలో ప్రధాన పోటీ ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు మధ్యనే ఉంటుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. సినీ పెద్దలు ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చూసినప్పటికీ.. వారి ప్రయత్నాలు ఫలించినట్టుగా కనిపించట్లేదు. తాజాగా.. ప్రకాష్ రాజ్ ఎన్నికలు నిర్వహించాలని మరోసారి కోరడం.. మాలో నెలకొన్న పరిస్థితిని తెలియజేస్తోంది. ఎన్నికలు నిర్వహించాల్సిన తేదీలను సైతం ప్రకాష్ రాజ్ సూచించడం గమనార్హం. సెప్టెంబర్ 12 లేదా 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణం రాజును కోరారు.
ఇప్పటికే ప్యానల్ ప్రకటించిన ప్రకాష్‌రాజ్.. దానికి ‘సినిమా బిడ్డలం’ అనే పేరు పెట్టారు. ప్యానల్ ప్రకటించిన రోజు నుంచే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ.. ఎన్నికల్లో బిజీ అయ్యారు. అటు మంచు విష్ణు కూడా ఎన్నికల్లో గెలించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మిగిలిన అభ్యర్థులు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. తాజా.. సమావేశంతో ఎన్నిక దాదాపు అనివార్యం అని తేలడంతో.. మా ఎన్నికల వ్యవహారం క్లైమాక్స్ కు చేరినట్టైంది. మరి, ప్రకాష్ రాజ్ సూచించిన తేదీలను పరిగణనలోకి తీసుకుంటారా? కొత్త తేదీలను ప్రకటిస్తారా? అన్నది చూడాలి.