Revanth Reddy: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.? ఇప్పుడు తెలంగాణకు రాజైన కేసీఆర్ తలుచుకుంటే కేసులకు కొదవా? అధికారం అంటే అంతే బై.. ప్రతిపక్ష నేతలను ఇష్టానుసారంగా కేసుల్లో పెట్టి లోపల వేయగలరు.. జైలుకు పంపగలరు. ఆది నుంచి కేసీఆర్ కు కంట్లో నలుసులా.. చెవిలో జోరీగా ఉన్న రేవంత్ రెడ్డిని వదల్లేదు. ఆయన టీడీపీలో ఉన్నా.. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చినా బయటకొచ్చి నిరసన తెలిపితే కేసులు.. అరెస్ట్ లు, జైల్లు కొనసాగాయి.
అయితే చట్టం తన పని తాను చేసుకుపోగా.. న్యాయస్థానం మాత్రం రేవంతుడికి తాజాగా ఊరటనిచ్చింది. అధికార పార్టీ మూడు కేసుల నుంచి విముక్తి కల్పించింది. రేవంత్ రెడ్డికి ఊపిరినిచ్చింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మూడు కేసులు కొట్టివేస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మూడు కేసులు కొట్టివేసినట్లు ప్రజా ప్రతినిధుల కోర్టు వాటి వివరాలను వెల్లడించింది. మహబూబాబాద్, చిక్కడపల్లి, ఓయూ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు కొట్టివేస్తున్నట్టుగా తెలిపింది.
ఇవేవో పెద్ద కేసులంటే మీరు తప్పులో కాలేసినట్టే.. చాలా చిన్న కేసులు అయినా పెట్టేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించారన్న అభియోగాలు మోపి కేసులు పెట్టారు. తాజాగా రేవంత్ కు ఆ కేసులు కొట్టివేసి కోర్టు ఊరటనిచ్చింది. అభియోగాలకు తగిన ఆధారాలు లేకపోవడంతో రేవంత్ రెడ్డిపై కేసుల వీగిపోయాయి.