తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి చేపట్టిన నుంచి రేవంత్ రెడ్డి జోష్ మీదున్నారు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న రేవంత్ ఇప్పుడు అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ చేస్తున్న మోసాలు ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయంటున్నారు. బీజేపీనీ సైతం ఆయన పగటి వేషగాళ్లు అంటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తాజాగా ఆయన వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై జోరుగా చర్చ సాగుతోంది.
జూలై 8న వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఇదివరకు పెట్టిన మీటింగుల్లో అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేసింది. బీజేపీ నాయకులు అప్పుడప్పుడు స్పందించినా టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఇప్పటి వరకు షర్మిల గురించి వ్యాఖ్యలు చేయలేదు. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇతర పార్టీలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆయన ఓటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ ను షర్మిల పార్టీపై అభిప్రాయం అడుగగా.. ‘షర్మిల పార్టీ తెలంగాణ ఎంతమాత్రం ప్రభావం ఉండదు. కుటుంబ సెంటిమెంట్ కంటే ప్రజల సెంటిమెంట్ బలంగా ఉంటుంది. గత ఎన్నికల్లో షర్మిల కుటుంబ సభ్యులు కలిసి ప్రచారం చేసినా 3 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు మాత్రమే గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం ఘనకార్యం చేశారని అధికారంలోకి వస్తారు. అంతేకాకుండా షర్మిల ఇప్పుడు పార్టీ పెట్టడం వల్ల పొందే ప్రయోజనం ఏమీ లేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను తయారు చేస్తాం..’అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇక టీఆర్ఎస్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేసీఆర్ ను ఘర్ వాపసీ చేస్తామన్నారు. కేసీఆర్ ఒక నియంతలా మారాడని అతనిని ఓడించడలమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. కేసీఆర్ విషయానికొచ్చేసరికి దూకుడుగా వ్యవహరించక తప్పదన్నారు. అయితే మరీ కేసీఆర్ అంత వల్గర్ గా మాట్లాడనని అన్నారు.