CM Revanth Reddy: గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నుంచి మొదలుపెడితే ఇతర ప్రభుత్వ పథకాల వరకు జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించారు. ఇప్పటికే శ్వేత పత్రాలు విడుదల చేశారు. త్వరలో నీటిపారుదల శాఖ మీద కూడా శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్ర ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ కుంగిపోయిన రెండు పిల్లర్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన బృందం మూడు రోజులుగా అక్కడ ఫీల్డ్ విజిట్ చేసింది. దానికి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించింది. “రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూశాం. మేడిగడ్డ బ్యారేజ్ కి జరిగిన డ్యామేజీ తీవ్రతను దగ్గరుండి చూశాం. దానికి మరమ్మతులు చేయడమా? లేక మొత్తం బ్లాక్ తొలగించి కొత్తదాన్ని నిర్మించడమా? నిపుణుల కమిటీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం.. ఈ అక్రమాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమంది అధికారులను తొలగించాం. బాధ్యులపై విచారణ కొనసాగుతుందని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకలకు సంబంధించి ప్రజాధనాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించక తప్పదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతే కాదు ఇప్పటివరకు జరిగిన పలు సమావేశాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి రేవంత్ రెడ్డి పదేపదే ప్రస్తావిస్తున్నారు. కీలక అధికారులను ఇప్పటికే ఇంటికి సాగనంపారు. కొంతమందికి స్థానచలనం కలిగించారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లకు ముప్పు ఉన్నట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతోపాటు విజిలెన్స్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కమిటీ సభ్యులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇప్పటికే ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఎత్తిపోతల పథకాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి విజిలెన్స్ కమిటీ నివేదిక అందించనుంది.
అయితే ఎత్తిపోతల పథకం భవితవ్యంపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని.. దానిపై స్పష్టత రావడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి తోడు సిట్టింగ్ జడ్జితో జ్యూడిషల్ విచారణకు హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ముఖ్యమంత్రి ఒక లేఖ రాశారు. స్పందించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణకు ఆఫర్ ఇచ్చింది. సిబిఐ కంటే ఉన్నతమైన విచారణ అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించినట్టు తెలుస్తోంది. మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఇటీవల పదేపదే సిబిఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి నాయకులు కూడా అదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. “సిబిఐ విచారణ కోరుతున్న కిషన్ రెడ్డికి న్యాయస్థానాల మీద నమ్మకం లేదా? వరంగల్ వరకు వచ్చిన కిషన్ రెడ్డి మేడిగడ్డ ప్రాంతాన్ని ఎందుకు సందర్శించలేదు? ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? కనీసం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదని” రేవంత్ రెడ్డి అన్నారు. కాగా, రెవెన్యూ రికవరీ యాక్ట్ అరుదైన సందర్భాల్లో మాత్రమే మన దేశంలో అమలు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని ఇటీవల పలుమార్లు ప్రస్తావించారు. అంటే కెసిఆర్ పై రెవెన్యూ రికవరీ యాక్టు ఉపయోగించి.. రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయగలరా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. మరి దీనిపై భారత రాష్ట్ర సమితి నాయకులు ఇంతవరకు స్పందించలేదు.