తెలంగాణలో ఏడేళ్లుగా కాంగ్రెస్ పరిస్థితి తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రభావంతో కాంగ్రెస్ ను దూరం పెట్టిన ప్రజలు మళ్లీ ఆదరించే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. పార్టీకి కొత్త నాయకత్వం వచ్చినా కాంగ్రెస్ జెండా ఎగిరేందుకు అనుమానాలే అన్న వాదానలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగిన హూజూరాబాద్ ఉప ఎన్నికలో ఈ పార్టీ డిపాజిట్ కూడా తెచ్చుకోలేని స్థితికి వచ్చింది. పార్టీలో నాయకత్వలేమియే కారణమని భావించిన అధిష్టానం ఆ పార్టీ బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పజెప్పారు. అయితే అష్టకష్టాలు పడుతూ రేవంత్ రెడ్డి పార్టీని గాడిలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నా అవి ఫలించడం లేదన్న చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకత్వం వచ్చాక కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా యూత్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డి ఈ బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీ నాయకుల్లో నమ్మకం ఏర్పడింది. ఇప్పుడైనా పార్టీ అభివృద్ది చెందే అవకాశాలున్నాయని ఆశ పడ్డారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ వ్యవహరించిన తీరు చూసి శ్రేణులు నిరాశ పడ్డారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడమే కాకుండా కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడడంతో ఇక పార్టీ గాడిన పడేనా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
కొత్తగా బాధ్యతలు తీసుకున్న తరువాత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా పార్టీకీ మైనస్ పాయింట్ గా ఉన్న సీనియర్లను బుజ్జగిస్తూ వస్తున్నారు. మరోవైపు కార్యకర్తలో ఉత్సాహం నెలకొల్పేందుకు గిరిజన దండోరా యాత్ర పేరిట సభలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే కొత్త పాలక వర్గానికి సవాల్ గా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక తీవ్ర పరాభావం తెచ్చిపెట్టింది. ఈ ఉప ఎన్నికలో కనీసం ఓట్లు పడలేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మానియా పనిచేయలేదని తెలుస్తోంది. ఇక్కడి అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినా రేవంత్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నాయకులు హుజూరాబాద్ లో పర్యటించారు. సభలు నిర్వహించి కార్యకర్తలను ఉత్తేజపరిచారు.
అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన వెంటనే పార్టీలోని పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి లాంటి నాయకులు రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రమాణికంగా తీసుకోవద్దని రేవంత్ చెబుతున్నా కిందిస్థాయి నాయకుల్లో మాత్రం ఆశలు సన్నగిల్లాయని తెలుస్తోంది. దీంతో పార్టీకి ఎలాంటి నాయకుడు వచ్చినా మారే పరిస్థితి కనిపించడం లేదని చర్చ జరుగుతోంది.
మరోవైపు రేవంత్ రెడ్డి ఇప్పుడు మరింత కష్టపడాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు టీఆర్ఎస్ నే కాకుండా బీజేపీని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు బీజేపీలోకి జారకుండా వారిని బుజ్జగించాలి. అయితే వచ్చే ఎన్నికల వరకు అనేక మార్పులు తీసుకొచ్చి పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని రేవంత్ టీం అంటోంది. ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ జెండాను ఎవరూ మరిచిపోరని, వచ్చే ఎన్నికల వరకు ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచిస్తున్నారు.