
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. జీహెచ్ఎంసీలో కేవలం 2 సీట్లే గెలవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోది. జాతీయ స్థాయి పార్టీ కావడం.. పంతాలూ పట్టింపులు ఎక్కువగా ఉండటం వల్ల ఏ ఒక్కరూ బాధ్యతగా లేకపోవడంతో పార్టీ రోజురోజుకూ తుడిచిపెట్టుకుపోతున్నట్లు విమర్శలున్నాయి.
Also Read: టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్నది వీరే
కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు. ఆ పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్‌లోనూ కొనసాగుతోంది. అందుకే.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డి పార్టీకి రిపేరు చేయాలని తలిచారు. అందుకే.. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీపై నిరంతరం పోరాడుతూ వస్తున్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని మరింత పటిష్టం చేసి, అధికారం వైపు నడిపిస్తానని నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎంపికకు కసరత్తు మొదలైంది. తనకు పదవి ఇస్తే తెలంగాణ అంతటా పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ ప్రకటించేశారు.
పీసీసీ పదవి కోసం ఇప్పటికే పార్టీలో పోటాపోటీ నెలకొంది. కానీ.. అధిష్టానం మాత్రం రేవంత్ వైపు మొగ్గు చూపుతున్న క్రమంలో, ఆయన పాదయాత్ర వ్యవహారం తెరమీదకు వచ్చింది. నిజంగా రేవంత్ పాదయాత్ర చేపడితే, కాంగ్రెస్ కు మళ్లీ జవసత్వాలు వస్తాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 2003కు ముందు కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైన పరిస్థితులు ఎదుర్కొంది. ఉనికి కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1467 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి, సరికొత్త రికార్డును సృష్టించారు. అప్పట్లో ఆయన పాదయాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ లోని సీనియర్లు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. అయినా అధిష్టానాన్ని ఒప్పించి రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టి, 2004లో అధికారంలోకి తీసుకు రాగలిగారు. ఇప్పటికీ ప్రజల మనసుల్లో రాజశేఖరరెడ్డి చిరస్థాయి ముద్ర వేయించుకున్నారు అంటే అది పాదయాత్ర ఫలితమే.
Also Read: గ్రేటర్లో కొత్త.. పాత కార్పొరేటర్ల మధ్య ఆధిపత్య పోరు..!
సరిగ్గా ఇప్పుడు 2003 ముందు ఉన్న పరిస్థితినే కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతోంది. మొన్నటి వరకు రెండో స్థానానికి పరిమితం అయినా, ప్రస్తుతం మూడో స్థానం కంటే కిందకు దిగజారింది. టీఆర్ఎస్, బీజేపీ ఆ తర్వాత స్థానాన్ని ఎంఐఎం దక్కించుకుని నాలుగో స్థానంలోకి కాంగ్రెస్ వెళ్లిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ కనుక పాదయాత్ర చేపడితే, కాంగ్రెస్ కు తిరిగి పునర్వైభవం రావడం ఖాయమనేది స్పష్టమవుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్