
Revanth Reddy: మునిగిపోతున్న కాంగ్రెస్ నావను వదిలి గులాబీ జెండా కప్పుకున్న ఎమ్మెల్యేల కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు ప్రణాళికలు రచిస్తున్నారు. వారిని తిరిగి సొంత గూటికి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారితో సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కిందకు పోవడంతో భవిష్యత్ దృష్ట్యా పార్టీ మారి టీఆర్ఎస్ గూటికి చేరారు. తీరా చేరాక అక్కడ కూడా విలువ లేకపోవడంతో ఇక మాకు దిక్కెవరని అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి వారిని తమ దారికి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా చొరవ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి (Revanth Reddy) వారితో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించి తమ దారికి తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ తనదైన శైలిలో వ్యూహాలు రూపొందించుకుంటున్నట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టాక రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే వారిపై అనర్హతా వేటు వేయించాలని చూస్తున్నారు.
పార్టీని విడిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పలువురు నాయకులకు కాంగ్రెస్ పార్టీలోనే భవిష్యత్ ఉందని చెబుతున్నారు. ఇన్నాళ్లు పార్టీకి పెద్ద దిక్కు ఎవరు లేకపోవడంతో పార్టీని వీడినా ప్రస్తుతం పార్టీకి బలం ఉందని నిరూపిస్తున్నారు. ఇందులో భాగంగా పోయిన వారిని తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత గూటికి చేరేలా ప్రేరేపిస్తున్నారు.
మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే డీఎస్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వారిని సైతం పార్టీకి తీసుకొచ్చే క్రమంలో ముందుకు సాగుతున్నారు. వారితో పలు దఫాలు చర్చలు జరిపి పార్టీలోకి రావాల్సిందిగా సూచిస్తున్నారు. వస్తే జరగబోయే పరిణామాలపై వివరణ ఇస్తున్నారు. భవిష్యత్ మనదే అని భరోసా కల్పిస్తున్నారు. మునిగిపోతున్న నావను ఒడ్డుకు చేర్చే బాధ్యత తనదేనని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధ్యమేనా అనే కోణంలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.