Revanth Reddy: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిరసనల మధ్య పదవి చేపట్టారు. అప్పటి నుంచి సీనియర్ల ఆగ్రహానికి గురవుతూనే ఉన్నారు. అయినా సొంత కోటరీ ఏర్పాటు చేసుకోవడంలో తలమునకలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ భవితవ్యంపై పట్టు సాధించాలని తాపత్రయ పడుతున్నట్లు సమాచారం. రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్లు సైతం రేవంత్ కు సహకరించాలని అధిష్టానం తలంటు పోయడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఏమి మాట్లాడలేక సైలంట్ అయిపోయారు. చివరకు సీనియర్లందరు తమ ఆగ్రహాన్ని పక్కన పెట్టి సర్దుకుపోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తున్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలే అన్ని మరిచిపోయి సర్దుకున్నప్పుడు సీనియర్లు మాత్రం ఏం చేయగలరు? ప్రస్తుతం రేవంత్ నాయకత్వాన్ని ఆమోదించడం తప్ప వారు చేసేదేమీ లేదు. కానీ అవకాశం దొరికితే తనను తొక్కేందుకు ప్రయత్నాలు చేస్తారని తెలుసుకున్న రేవంత్ తనకున్న అనుచరులతో ఓ వర్గం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో తన వర్గాన్ని తయారు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
రాష్ర్టంలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా అంతటా తన నాయకత్వాన్ని అనుసరించే వారి కోసం రేవంత్ రెడ్డి వడపోస్తున్నట్లు తెలుస్తోంది. తన వెంట నిలిచే కోటరీ కోసం ఆరా తీస్తున్నారు. రేపు ఏదైనా జరిగితే తనకు మద్దతుగా సమాధానం చెప్పగలిగే వారిని తమ కోటరీగా ఉంచుకోవాలని చూస్తున్నారు. మనస్ఫూర్తిగా తన నాయకత్వాన్ని అంగీకరించే వారెవరు? అనే కోణంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే తమ అనుచరుల్ని తయారు చేసుకున్నట్లు సమాచారం.
అన్ని నియోజకవర్గాలపై పట్టు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లోని తన మద్దతుదారులను యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. భవిష్యత్ లో సీనియర్లు తనను వ్యతిరేకిస్తే పరిస్థితి ఏంటని గ్రహించి పక్కా ప్రణాళిక ప్రకారం తన వెంట నిలిచే వారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయో అని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.