Revanth Reddy vs Uttam Kumar: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ గండర గండడుగా కేసీఆర్ పేరు పొందారు. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని, చంద్రబాబు నాయుడిని, నరేంద్ర మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. విలేకరుల సమావేశం పెడితే గంటలకి గంటలు విమర్శలు చేసేవారు.. కెసిఆర్ కు కౌంటర్ ఇవ్వడంలో అటు కాంగ్రెస్, ఇటు బిజెపి విఫలమయ్యేవి. పైగా కేసీఆర్ అనుకూల మీడియా దారుణంగా ఆయా వ్యక్తుల మీద దుష్ప్రచారం చేసేది.
ఇప్పుడు కాలం మారింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. ఆయనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా బయటికి వస్తున్నారు. మీడియాలో ప్రముఖంగా కనిపించడానికి విమర్శలు చేసి వెళ్లిపోతున్నారు. తాజాగా కూడా ఆయన బయటికి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోలు తీస్తామని అన్నారు. రేపటి నుంచి ఉద్యమం మొదలుపెడతామని హెచ్చరికలు జారీ చేశారు.. బీభత్సంగా ప్రకటనలు చేసి రేవంత్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. యూరియా నుంచి మొదలు పెడితే పాలమూరు జిల్లాలో కృష్ణా జిల్లా వరకు ప్రతి విషయాన్ని వెల్లడించిన కేసీఆర్.. రేవంత్ ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా విమర్శలు చేశారు.
సహజంగా కేసీఆర్ విమర్శలు చేస్తే దానికి కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి చాలా సమయం పట్టేది.. పైగా ఇష్యూ బేస్డ్ గా కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది కాదు.. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి మాదిరిగా లేదు.. వరుస ఎన్నికల్లో విజయం సాధించుకుంటూ వచ్చింది. పైగా అధికారంలో కూడా ఉంది.. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ నేరుగా స్పందించారు.. అటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి కూడా దీటుగా మాట్లాడారు.. వాస్తవానికి ఈ పరిణామాన్ని అటు కేసీఆర్, ఇటు భారత రాష్ట్ర సమితి ఊహించలేదు. “కెసిఆర్ ఆయన కొడుకు కోసమే బయటికి వచ్చారు. కెసిఆర్ చేస్తే హరీష్ రావు పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. అల్లుడి చేతిలోకి పార్టీ వెళ్ళిపోతుందని భయంతోనే కెసిఆర్ బయటకు వచ్చారు. కెసిఆర్, కేటీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా అత్యాచారం చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది. వరుస ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఆయనకు ఏమాత్రం ఇంగితం రావడం లేదు. కెసిఆర్ చావాలని నేను కోరుకోను. కుర్చీ కోసం కొడుకు, అల్లుడు కేసీఆర్ చావును కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. కెసిఆర్ తమలపాకులతో కొడితే.. నేను తలుపు చెక్కలతో కొట్టగలను. కెసిఆర్ కు బయటి వారితో కాదు, సొంత కుటుంబ సభ్యులతో ప్రమాదం. హరీష్ రావు, కేటీఆర్ కలిసి కెసిఆర్ ను పూర్తిస్థాయిలో నిర్బంధించారు. రెండు సంవత్సరాల తర్వాత కలుగులో నుంచి కేసీఆర్ బయటికి వచ్చారు. వచ్చేయడాది జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. ఓటమి తర్వాత కేసీఆర్ మారతారని అనుకున్నాను. కానీ ఆయన మళ్లీ అబద్ధాలే చెబుతున్నారు. ప్రజల పట్ల ఆయనకు ఏమాత్రం ప్రేమ లేదు. అధికార వ్యామోహం మాత్రమే ఉంది. అసెంబ్లీ సమావేశాలకు కేసిఆర్ రావాలని కోరుకుంటున్నాను . కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఏపీ జల దోపిడీ జరిగిందని” రేవంత్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఉత్తం కుమార్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ” ఉద్యమాలు కాదు, ముందుగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కమీషన్ కోసం భారీగా ఖర్చుపెట్టి ప్రాజెక్టులు నిర్మించారు. వాటి ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా? దేవాదుల, ఎస్ ఎల్ బీ సీ దిండి ఏమైనా పూర్తి చేశారా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికైనా సాగునీరు అందించారా? తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాజిల్లాలు అందించే విషయంలో కేంద్రంతో మేమే ఎక్కువ పోరాడుతున్నాం.. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను సర్వనాశనం చేసింది కేసీఆర్. కెసిఆర్ మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజం కాదు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాజలాలలో అన్యాయం చేసింది ముమ్మాటికి కెసిఆర్ ప్రభుత్వం. 1.80 లక్షల కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ఎత్తిపోతల పథకం సర్వనాశనమైంది. రైతులకు ఎటువంటి ప్రయోజనం జరగలేదు. ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టి గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడేమో మా మీద విమర్శలు చేస్తున్నారని” ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.