Homeజాతీయ వార్తలుRevanth Reddy: కేసీఆర్ పై మరో బాంబు పేల్చిన రేవంత్

Revanth Reddy: కేసీఆర్ పై మరో బాంబు పేల్చిన రేవంత్

Revanth Reddy: తానా మహాసభల్లో ఉచిత విద్యుత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మరో బాంబు పేల్చారు. భారత రాష్ట్ర సమితి నాయకులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. తన ధోరణి మార్చుకోలేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న వ్యవసాయానికి 24 విద్యుత్ విద్యుత్ పై మరిన్ని కీలక విషయాలు వెల్లడించారు.”రైతులకు ఉచిత విద్యుత్ కోసం 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి చిన్న, సన్న కారు రైతులకు ఎనిమిది గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, నేతల ఫామ్ హౌస్ లు, భూములు ఉన్న ప్రాంతాల్లో పది నుంచి 12 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్నది. రాష్ట్రంలో ఎక్కడా కూడా 12 గంటలకు నుంచి ఉచిత విద్యుత్ సరఫరా కానప్పుడు 16 వేల కోట్లు ఖర్చు ఎలా చేస్తున్నారు” అని రేవంత్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు.. ఉచిత విద్యుత్ పేరుతో ఆ బడ్జెట్ కింద కేటాయించిన నిధుల్లో సగం డబ్బు అంటే ఏడాదికి 8 వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

45 వేల కోట్ల టెండర్లు ఇచ్చి..

ఇక పవర్ ప్లాంట్ల విషయంలోనూ రేవంత్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. 45 వేల కోట్లకు టెండర్లు ఇచ్చి అందులో అవినీతికి పాల్పడ్డారని రేవంత్ వివరించారు. ఎక్కడా లేని రేటుకి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని, కేంద్రం చెప్పినా వినకుండా అధిక రేటుకు కుంటున్నారని ఆరోపించారు..”అమెరికాలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొందరు నిపుణులు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై ప్రశ్న అడిగితే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను నేను స్పష్టం చేశాను. అయితే, తాను చెప్పిన సమాధానం లో కొంత భాగాన్ని కట్ చేసి ప్రచారం చేశారు. ఐటీ మంత్రి కేటీఆర్ అతి తెలివి ప్రదర్శించి చిల్లర వ్యవహారం చేశారు. ఉచిత విద్యుత్ పై మరోసారి చర్చ జరగడం మంచిదే. తెలుగుదేశం హయాంలో జరిగిన బషీర్బాగ్ కాల్పుల ఘటన సమయంలో అప్పటి ప్రభుత్వంలో కెసిఆర్ కీలకంగా ఉన్నారు. ఉచిత కరెంటు ఇవ్వడం కుదరదని తెలుగుదేశం పార్టీతో చెప్పించిన వ్యక్తి కెసిఆర్. అనడు విద్యుత్ ఉద్యమంలో రైతులను చంపిన పాపం ముమ్మాటికీ కేసీఆర్ దే” అని రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ను అందించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ పై పేటెంట్ కాంగ్రెస్ పార్టీ దేనని రేవంత్ ప్రకటించారు. ఉచిత మాత్రమే కాదు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.

సోనియా గాంధీ కృషితో..

రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ విషయంలో తెలంగాణకు నష్టం జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వినియోగం ఆధారంగా తెలంగాణకే ఎక్కువ విద్యుత్ వచ్చేలాగా సోనియా గాంధీ చర్యలు తీసుకున్నారు అని వివరించారు. జనాభా ప్రాతిపదికన పంచితే తెలంగాణకు 38% మాత్రమే విద్యుత్ దక్కేది. దాంతో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు తెలంగాణలో చీకట్లు కమ్ముకునేవి. అందుకే జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ఆధారంగా విద్యుత్ కేటాయించారు. అందుకే తెలంగాణకు 53%, ఆంధ్రప్రదేశ్ కు 47 శాతం విద్యుత్ కేటాయించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దీనికోసం సోనియాగాంధీ, అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కృషి చేశారని ఆయన వివరించారు.” ప్రస్తుతం కెసిఆర్ దోపిడీ ఎక్కువైపోయిందని.. కరెంటు నష్టాలు పూడ్చుకోవాలి అంటే రైతుల వ్యవసాయ కనెక్షన్లకు కేసీఆర్ మీటర్లు బిగిస్తారు. మొన్నటిదాకా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించబోమని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చెప్పింది. కానీ అదంతా ఉత్తి డొల్ల. ఇప్పుడు త్వరలో వ్యవసాయ మోటార్లకు కెసిఆర్ మీటర్లు బిగిస్తారు” అని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మరోసారి తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular