Revanth Reddy- KCR: ఓటుకు నోటు కేసులో ఇబ్బంది పెట్టాడు. 2018 ఎన్నికల్లోనూ చుక్కలు చూపించాడు. జైలుకు పంపించాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత సీనియర్లతోనూ నరకం చూపించాడు. వరుస ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా చేశాడు. వ్యాపారాల మీద దెబ్బకొట్టాడు. ఆర్థిక మూలస్తంభాలన నిలువునా కూల్చేశాడు. ఇంకో లీడర్ అయితే శరణుజొచ్చేవాడేమో? ఆ ధైర్యం ఎక్కడిదో? ఎలా వచ్చిందో తెలియదు కానీ.. రేవంత్‌రెడ్డి వాటి నుంచే రాటు దేలాడు. ఉలిదెబ్బలను తిని శిల శిల్పమైనట్టు.. కేసీఆర్ చేతిలో వరుస పరాభావాలు ఎదుర్కొని నేడ అతడినే ఎదురించే స్థాయికి ఎదిగాడు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారని ఎవరూ అనుకోలేదు. ఆయన వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా, ఇక్కడున్న ప్రభుత్వం నుంచి కాచుకోవాల్సిన దృష్ట్యా బీజేపీలోకి వెళ్తారు అని అందరూ ఊహించారు. కానీ జరిగింది వేరు. ఎలా ఒప్పించారో, ఏ తీరున హామీలు ఇచ్చారో తెలియదు కానీ పొంగులేటిని కాంగ్రెస్‌లోకి తీసుకురావడంతో రేవంత్ కృతకృతులయ్యారు. జూపల్లి కృష్ణారావు, దామోదర్‌రెడ్డి వంటివారిని కూడా కాంగ్రెస్‌లోకి లాగారు. వీరిలో జూపల్లిది కేసీఆర్ సామాజికవర్గమే. వీరి రాకతో ఒక్కసారిగా బీఆర్‌ఎస్ ఆత్మరక్షణలో పడింది. ఈ ఎఫెక్ట్ ఉండకుండా నిన్న ఏకంగా కేసీఆర్ 650 వాహనాలతో మహారాష్ట్ర వెళ్లారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ పెట్టిన ఇబ్బందుల నుంచే గుణపాఠాలు నేర్చుకున్న రేవంత్.. వాటినే తన విజయానికి సోపానాలు మార్చుకున్నారు. తలనొప్పిగా మారిన సీనియర్లను పట్టించుకోలేదు. తనకు నచ్చిన దారిలోనే నడుచుకుంటూ వెళ్లారు. రాహుల్, ప్రియాంక గాంధీలను తెలంగాణకు తీసుకొచ్చారు. రైతు, నిరుద్యోగ డిక్లరేషన్లు ప్రకటించారు. అంతే కాదు పార్టీలో యువరక్తాన్ని నింపారు. వరుసగా పాదయాత్రలు చేశారు. పార్టీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేసీ వేణుగోపాల్, కొప్పుల రాజకు నివేదిస్తూ వచ్చారు. ఇదే సమయంలో సీనియర్లను అనివార్యంగా తలొంచే పరిస్థితి తీసుకొచ్చారు. భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర్‌రాజ నర్సింహా, జానారెడ్డి వంటి వారు తనకు సహకరించాల్సిన తప్పక పరిస్థితిని నెలకొల్పారు. హై కమాండ్ కూడా రేవంత్‌కు ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో సీనియర్లు కూడా సైలెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి లేదు అనే స్థాయి నుంచి ప్రధాన పోటీదారు అనే పరిస్థితిని రేవంత్ కల్పించాడు. మరి ఈ ఊపును కాంగ్రెస్ చివరి వరకూ కొనసాగించగలదా? లేక మళ్లీ కేసీఆర్ ఉచ్చులో చిక్కుకుంటుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.