Revanth Reddy: గతంలో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే మాట మీద ఉండేవి. అయితే అవి అయా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు… తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం అన్న విమర్శ ఉంది.పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం అటు కెసిఆర్,ఇటు జగన్ పావులు కదిపారన్న ఆరోపణ కూడా ఉంది.అంతెందుకు సరిగ్గా తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున నాగార్జునసాగర్ ను జగన్ ముట్టడించారు. తద్వారా సెంటిమెంట్ వచ్చి కెసిఆర్ కు లబ్ధి చేకూరుతుందని భావించారు. కానీ వారి ఆలోచన వర్కౌట్ కాలేదు. తెలంగాణ ప్రజలు విశ్వసించలేదు.
ఏపీ సిఐడి హైదరాబాదులో స్వేచ్ఛగా వ్యవహరించేది. తెలంగాణ సర్కార్ సైతం తన వంతు సహకారం అందించేది. పేరుకే రాష్ట్ర విభజన కానీ.. ఏపీ ప్రజా ప్రతినిధులు ఎక్కువగా గడిపేది తెలంగాణలోనే. దీంతో రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ చేసే ప్రయత్నాలకు కెసిఆర్ ప్రభుత్వం సహకరించేది. రఘురామకృష్ణం రాజు,ఇతర నేతల అరెస్టులు, సిఐడి నోటీసులు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సాయపడేది. అర్ధరాత్రి అరెస్టులకు సైతం స్వేచ్ఛ కల్పించేది.కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. మునుపటిలా సాయం మాత్రం దొరకడం లేదు.
చంద్రబాబు హయాంలో సైతం కేసీఆర్ తెలంగాణలో అధికారంలో ఉండేవారు.అప్పట్లో సైతం రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి విషయంలో పోటీ ఉండేది. ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు గట్టిగానే నిలబడే వారు. అది కాస్త రాజకీయ వైరంగా మారింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కెసిఆర్ తో స్నేహం కుదిరింది. కానీ అది రాష్ట్ర ప్రయోజనం కంటే వ్యక్తిగత ప్రయోజనం కే దోహద పడింది. ఒకానొక దశలో తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించిన షర్మిలపై కేసీఆర్ సర్కార్ ఒకరకంగా కేసులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అరెస్టు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో ఏపీ నుంచి బాధితురాలిగా మిగిలిన షర్మిలకు ఎటువంటి సహాయం దక్కలేదు. షర్మిల కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ వారికి టార్గెట్ అయ్యారు. కానీ కెసిఆర్ తో ఉన్న స్నేహంతో షర్మిల విషయంలో జగన్ నోరు మెదిపిన దాఖలాలు లేవు. పైగా తెలంగాణ రాజకీయాలతో తమకు సంబంధం ఏంటని ప్రశ్నించేవారు. తెలంగాణ సర్కార్ సహకారంతో ఏపీలోని రాజకీయ ప్రత్యర్థులపై మాత్రం ఓ రేంజ్ లో ఆడుకున్నారు.
ఇప్పుడు అదే ఫార్ములాను రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల తీసుకున్న తర్వాత ఆమె వైసీపీకి టార్గెట్ అయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా ఉండే ప్రో వైసిపి నేతలు షర్మిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు వివేకానంద రెడ్డి కుమార్తె షర్మిలను అనుసరిస్తున్నారు. తన తండ్రి వివేకా హత్యపై గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో షర్మిల, సునీతను టార్గెట్ చేసుకుని వైసిపి నేతలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. వారిద్దరినీ లేపేసేయ్ అన్నయ్య.. శత్రుశాశం ఉండకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తెలంగాణ పోలీసులకు సునీత ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణలోని వైసీపీ నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. పూర్వం మాదిరిగా తెలంగాణలో కెసిఆర్ సర్కార్ లేదు. అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం. షర్మిల ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు. అందుకే రేవంత్ ఏపీ వైసీపీ నేతల విషయంలో సీరియస్ యాక్షన్ కు దిగారు. సహజంగా ఇది వైసీపీ నేతలకు మింగుడు పడని విషయం. మొత్తానికైతే మునుపటిలా రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు తెలంగాణ యంత్రాంగం సహకరించే పరిస్థితి లేదు. ఏమైనా చేస్తే ఏపీలోనే చూసుకోవాలి. ఎన్నికల ముంగిట తెలంగాణలో ఉన్న వైసీపీ నేతలకు ఇది ప్రాణ సంకటమే.