https://oktelugu.com/

Dhanunjay Reddy: ధనుంజయ్ రెడ్డి ఇన్.. గడికోట శ్రీకాంత్ రెడ్డి అవుట్?

గడికోట శ్రీకాంత్ రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి సీనియర్ నాయకుడు. లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి 1999, 2004 ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లి కనుమరుగయ్యింది.

Written By: , Updated On : February 6, 2024 / 01:19 PM IST
Dhanunjay Reddy

Dhanunjay Reddy

Follow us on

Dhanunjay Reddy: వైసీపీలో మరో ఆత్మీయుడు పై జగన్ వేటు వేయనున్నారా? ఆయనను పక్కకు తప్పించనున్నారా? ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిని రంగంలోకి దించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే, రాయచోటి శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి జగన్ కు అత్యంత విధేయుడు. క్లాస్మెట్ కూడా. ఆ చనువుతోనే 2009లో తండ్రి రాజశేఖర్ రెడ్డి కి చెప్పి శ్రీకాంత్ రెడ్డి కి జగన్ టికెట్ ఇప్పించారు. అప్పటినుంచి వరుసగా మూడుసార్లు రాయచోటి నియోజకవర్గం నుంచి శ్రీకాంత్ రెడ్డి గెలుపొందుతూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం జగన్ కొత్త లెక్కలతో.. రాయచోటికి కొత్త అభ్యర్థిని తేనున్నట్టు తెలుస్తోంది.

గడికోట శ్రీకాంత్ రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి సీనియర్ నాయకుడు. లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి 1999, 2004 ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లి కనుమరుగయ్యింది. రాయచోటి నియోజకవర్గం ఆవిర్భవించింది. తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు శ్రీకాంత్ రెడ్డి అమెరికా వెళ్ళిపోయారు. పది సంవత్సరాల పాటు ఐటీ ఉద్యోగం చేసేవారు. కానీ రాజకీయాలపై ఆసక్తి ఉండడంతో 2009లో అమెరికా నుంచి వచ్చేశారు. దీంతో జగన్ పట్టు పట్టి మరి రాయచోటి సీటును శ్రీకాంత్ రెడ్డి కి ఇప్పించారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాంత్ రెడ్డి జగన్ వెంట అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలుపొందారు. 2019లో సైతం పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి పదవిని ఆశించారు. కానీ సామాజిక సమీకరణలో భాగంగా శ్రీకాంత్ రెడ్డిని జగన్ పక్కన పెట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ తో సరిపెట్టారు. ఈ ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డిని సైతం పక్కకు తప్పిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అత్యంత సన్నిహితులైన కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెన్నకేశవరెడ్డి లను తప్పించారు. ఇప్పుడు ఆ జాబితాలో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కోసమే శ్రీకాంత్ రెడ్డిని తప్పిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుంజయ రెడ్డి సీఎం జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉన్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీ వ్యవహారాలను సైతం ఆయన నడిపిస్తున్నారన్న విమర్శ ఉంది. ప్రస్తుతం సీఎంఓ అదనపు కార్యదర్శిగా ధనంజయ రెడ్డి ఉన్నారు.ఆయన స్వగ్రామం రాయచోటి మండలం చెన్నముక్క పల్లె. ఇటీవల చేపట్టిన సర్వేలో శ్రీకాంత్ రెడ్డి వెనకబడినట్లు సమాచారం. అందుకే సీనియర్ ఐఏఎస్ అధికారిగా, నియోజకవర్గంలో బంధుగణం ఎక్కువగా ఉన్న ధనుంజయ రెడ్డి వైపు సీఎం జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో రాయచోటి విషయంలో ఒక స్పష్టత రానుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.మరి ఏం జరుగుతుందో చూడాలి.