
Ponguleti Srinivas Reddy- Revanth Reddy: ఖమ్మం మాజీ ఎంపీ, భారత రాష్ట్ర సమితి అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ లోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని ప్రకటించారు.. పాదయాత్రలో భాగంగా ములుగులో ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం ఏర్పడింది. నూతన సంవత్సరం సందర్భంగా తన క్యాంపు ఆఫీసులో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి భారత రాష్ట్ర సమితి అధిష్టానం పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మనకు ఇన్నాళ్లు దక్కుతున్న గౌరవం ఎలా ఉందో చూశారు కదా అంటూ శ్రేణులతో వ్యాఖ్యానించారు. అది మొదలు పలు సందర్భాల్లో ఆయన అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మొన్న వైరాలో జరిగిన సమావేశంలో తన అభ్యర్థిగా విజయబాయిని ప్రకటించారు. అశ్వరావుపేట లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తన అభ్యర్థిగా ఆదినారాయణ ను ప్రకటించారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఖమ్మం, పాలేరు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను ప్రకటిస్తానని పొంగులేటి చెబుతున్నారు. పాలేరులో వైయస్ షర్మిల కు లోపాయికారి మద్దతు ప్రకటించిన శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో తాను బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
అయితే ఇటీవల రేణుక చౌదరి కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని, వచ్చేవారు వస్తుంటారని, పోయేవారు పోతుంటారని ఆమె వ్యాఖ్యానించారు. పొంగులేటి వస్తే పార్టీ మరింత బలపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం పెట్టని కోట అని, ఇది పలు సందర్భాల్లో నిరూపితమైందన్నారు.. అయితే రేణుక చౌదరి వ్యాఖ్యలను ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.
అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వర్గం ఆగ్రహంగా ఉంది. ఎందుకంటే 2018లో మధిరలో విక్రమార్క పోటీ చేసినప్పుడు ఆయనకు పోటీగా తన అనుచరుడు లింగాల కమల్ రాజును పొంగులేటి దింపారు. ఆ సమయంలో భట్టి ని గెలవకుండా చూసేందుకు రకరకాల ప్రణాళికలు రూపొందించారు. అయితే అప్పట్లో పొంగులేటికి, భట్టి వర్గాలకు ప్రచ్చన్న యుద్ధం కొనసాగింది.. అయితే కమల్ రాజు కొద్ది ఓట్ల తేడాతోనే భట్టి పై ఓడిపోయారు.. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డి తనకు చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు పొంగులేటి రాకను భట్టి విక్రమార్క అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డికి, విక్రమార్కకు టర్మ్స్ బాగా లేకపోవడం కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు ఇతర పార్టీల్లో చేరికకు పొంగులేటి ఇంతవరకు తెరదించలేదు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి తన అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.. మొన్నటిదాకా బిజెపిలో చేరుతారని ఊహాగానాలు వినిపించినప్పటికీ… అవి కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రచారం జరిగినప్పటికీ… అందులో కూడా అడుగు ముందుకు పడలేదు.. ఏ పార్టీలో చేరుతానని దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ… తన అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తూ పొంగులేటి మాత్రం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.